Zohran Mamdani: జొహ్రాన్ మమ్‌దానీ: ట్రంప్ ఎత్తులకు చెక్ పెట్టిన మమ్‌దానీ.. మన మీరా నాయర్ కుమారుడే..!

మన మీరా నాయర్ కుమారుడే..!

Update: 2025-11-05 08:48 GMT

Zohran Mamdani: అమెరికాలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) విజయం సాధించి సరికొత్త చరిత్ర లిఖించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఎత్తులను తిప్పికొట్టి 33 ఏళ్ల జొహ్రాన్ న్యూయార్క్ మేయర్ (New York Mayor Zohran Mamdani)గా ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్ఠించిన మొదటి భారత-అమెరికన్ ముస్లిం వ్యక్తి ఆయనే. భారతీయ సంతతికి చెందిన మమ్‌దానీ మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) కుమారుడు.

మూడు ఖండాలతో అనుబంధం..

జొహ్రాన్ మమ్‌దానీ 1991 అక్టోబర్‌లో ఉగాండా రాజధాని కంపాలాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూలాలు కలిగినవారే అన్నది గమనార్హం. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ సమాజానికి చెందిన మహిళ. భారతీయ సినిమా రంగంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరు. 'సలామ్ బాంబే', 'మాన్‌సూన్ వెడ్డింగ్' లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. తండ్రి మహ్మద్ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం. ముంబయిలో జన్మించిన మహ్మద్ తర్వాత ఉగాండాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయన విద్యావేత్తగా పేరుగాంచారు. జొహ్రాన్‌కు ఐదేళ్ల వయస్సులో ఆయన కుటుంబం దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌కు తరలివెళ్లింది. ఆ తర్వాత రెండేళ్లకే న్యూయార్క్‌కు మకాం మార్చి అక్కడే నివాసం ఏర్పరచుకుంది. సైన్స్ మరియు ఆఫ్రికన్ స్టడీస్‌లో జొహ్రాన్ డిగ్రీ పూర్తి చేశారు.

తల్లి అనుభవాలు ప్రేరణగా.. రాజకీయ రంగంలోకి అడుగు

జొహ్రాన్ మమ్‌దానీ రాజకీయ విజయాలకు తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ఉంది. ప్రత్యేకించి తల్లి మీరా నాయర్ జీవిత పాఠాలు ఆయనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. సంప్రదాయాలు, మూస భావనలను సవాలు చేస్తూ ముందుకు సాగారు. తన జీవిత కథలను కుమారుడు జొహ్రాన్‌కు చెప్పి ప్రేరేపించారు. 'మన కథలను మనమే తర్వాతి తరానికి చెప్పకపోతే ఎవరు చెబుతారు' అనేది ఆమె భావన. ఆమె నుంచి నేర్చుకున్న పాఠాలు జొహ్రాన్ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదులుగా మారాయి. అణచివేతలకు వ్యతిరేకంగా గళమెత్తాలి అనే లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2020లో మొదటిసారి న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్‌గా గెలిచి మరో మైలురాయిని అధిగమించారు.

ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగినా.. విజయం మమ్‌దానీదే

మమ్‌దానీ విజయం ట్రంప్ అధికారానికి గట్టి దెబ్బగా మారింది. ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు రిపబ్లికన్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నినా విఫలమయ్యాయి. రిపబ్లికన్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ మమ్‌దానీ తన ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మమ్‌దానీ గెలిస్తే న్యూయార్క్‌కు ఫెడరల్ సహాయం ఆపేస్తామని అధ్యక్షుడు హెచ్చరించారు! యూదు వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని మమ్‌దానీ ఓటర్ల మనసు గెలుచుకున్నారు. ఉచిత హామీలు, సంక్షేమ పథకాలతో ప్రచారం చేసి విజయం సాధించారు.

సూపర్ డైరెక్టర్ మీరా నాయర్..

జొహ్రాన్ తల్లి మీరా నాయర్ భారత సినిమా రంగంలో ప్రసిద్ధ దర్శకురాలు. 1988లో 'సలామ్ బాంబే' చిత్రంతో దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టారు. మురికివాడల్లోని పిల్లలు, బాలకార్మికుల జీవితాలను చిత్రీకరించిన ఆ సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ లాంటి అవార్డులకు నామినేట్ అయింది. 'మిస్సిస్సిపీ మసాలా', 'ది నేమ్‌సేక్', 'మాన్‌సూన్ వెడ్డింగ్' వంటి చిత్రాలు కూడా ఆమెకు మరిన్ని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

Tags:    

Similar News