ChatGPT : చాట్ జీపీటీ మనల్ని మూర్ఖులను చేస్తుందట.. పిల్లల బుర్రలు మొద్దుబారుతున్నాయట

పిల్లల బుర్రలు మొద్దుబారుతున్నాయట;

Update: 2025-06-20 06:34 GMT

ChatGPT : ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల పనులన్నీ ఎంత ఈజీ అయ్యాయో తెలిసిందే కదా. ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత అయితే, గంటలు పట్టే పని కూడా సెకన్లలో అయిపోతోంది. చాట్‌జీపీటీ (ChatGPT) లాంటి ఏఐ టూల్స్‌పై జనాలు చాలా ఆధారపడుతున్నారు. కానీ, ఈ ఏఐ టూల్స్ మనకు ఎంత నష్టం చేస్తున్నాయో తెలుసా? తాజాగా జరిగిన ఒక స్టడీలో చాట్‌జీపీటీ గురించి ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఇది విద్యార్థులను మూర్ఖులను చేస్తోందట. ఏఐ వచ్చిన తర్వాత పిల్లలు తమ బుర్రను తక్కువగా వాడుతున్నారట.

ఎంఐటీ (MIT)కి చెందిన మీడియా ల్యాబ్ వాళ్ళు మనుషుల మెదడుపై ఏఐ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక కొత్త స్టడీ చేశారు. ముఖ్యంగా విద్యార్థులపై దీని ప్రభావం చూశారు. చదువుల కోసం, ఏదైనా నేర్చుకోవడం కోసం చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌ను వాడటం వల్ల కాలక్రమేణా మనుషుల ఆలోచించే శక్తి తగ్గిపోతోందట. ఈ స్టడీలో రీసెర్చర్లు (పరిశోధకులు) బోస్టన్ ప్రాంతానికి చెందిన 18 నుండి 39 ఏళ్ల వయసున్న 54 మంది విద్యార్థులను తీసుకున్నారు. వాళ్ళను మూడు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లోని విద్యార్థులను ఏఐ టూల్ సహాయంతో వ్యాసాలు రాయమని చెప్పారు. ఈ సమయంలో విద్యార్థుల మెదడులో జరిగే పనితీరును ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ అనే పరికరంతో పరిశీలించారు.

రిజల్ట్స్ చాలా ఆందోళన కలిగించాయి. ఎందుకంటే, చాట్‌జీపీటీ వాడిన విద్యార్థుల్లో మెదడు పనితీరు చాలా తక్కువగా కనిపించిందట. దీనితో ఒక విషయం స్పష్టమైంది. చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ ముఖ్యంగా పిల్లల మెదడుపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. తమ మెదడును తక్కువ వాడి, చాట్‌జీపీటీ సహాయంతో వ్యాసాలు రాసిన విద్యార్థులకు, ఆ వ్యాసాలు గుర్తుంచుకోవడంలో చాలా ఇబ్బంది ఎదురైందట. అదే సమయంలో, ఏ డిజిటల్ టూల్ సాయం లేకుండా సొంతంగా పనులు చేసిన విద్యార్థుల్లో మాత్రం మెదడు చాలా చురుకుగా పనిచేసినట్లు కనిపించిందట. అలాంటి విద్యార్థుల పనిలో క్రియేటివిటీ, జ్ఞాపకశక్తి చక్కగా కలిసి పనిచేశాయి. ఎందుకంటే, ఆ విద్యార్థులు తమ సొంత మెదడును ఉపయోగించి ఆలోచించి రాశారు కాబట్టి, వాళ్లకు ఆ వ్యాసాలు గుర్తుంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు.

Tags:    

Similar News