జనసేనలో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యం

ఉత్తరాంధ్రలో ఇకపై నిరంతర సమీక్షలు;

Update: 2025-07-30 04:30 GMT

జనసేన పార్టీలో ప్రథమ ప్రాధాన్యం కార్యకర్తలకే ఉంటుందని, కార్యకర్తల సంతోషమే మా సంతోషమని, ఇకపై ప్రతీ నెలా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మంగళవారం విజయనగరంలో జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సమావేశంలో నాగబాబు జనసేన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో ఉత్తరాంధ్రలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరం స్నేహితుల్లా కలసిమెలసి ముందుకు సాగాలని, పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆలోచనలతో కూటమి ఏర్పాటుకు బీజం వేశారో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం దక్కించుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అలాంటి సంఘటనలు ఎదురైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సోషల్ అడిట్ నిర్వహిస్తామని తెలిపారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది ప్రతీ ఒక్కరి కర్తవ్యంగా భావించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఎక్కువసార్లు కలవడం, సామాజిక అంశాల గురించి చర్చించడం, ప్రభుత్వ కార్యకలాపాల గురించి అవగాహన పెంపొందించుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, జనసేన ఎదుగుదల గురించి చర్చించడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించ వచ్చని చెప్పారు. పనులను సమర్ధవంతముగా పూర్తి చేసే వారితో చర్చిస్తూ, వారు ఆ పనులను ఎలాంటి విధానాలతో చక్కదిద్దారో తెలుసుకొని అలాంటి విధానాలను అనుసరిస్తూనే వినూత్న రీతిలో ముందుకు సాగుతూ ఫలితాలు సాధించాలని సూచించారు.

ఒకరితో ఒకరు కలిసికట్టుగా పని చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనదని, ఒకరిని ఒకరు గౌరవించుకుంటు ముందుకు సాగితే ప్రతికూలమైన ఫలితాలు సాధించవచ్చని నాగబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల శాసన సభ్యురాలు లోకం మాధవి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, విజయనగరం జిల్లాకు చెందిన పీ.ఓ.సీ.లు విసినిగిరి శ్రీనివాసరావు, గిరడా అప్పలస్వామి, ఆదాడ మోహన్ రావ్, మర్రాపు సురేష్, కండ్రక మల్లేశ్వర రావు, వబ్బిన సత్తిబాబు, స్థానిక నాయకులు అవనపు విక్రమ్, శ్రీ గురాన అయ్యలు, ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అన్ని మండలాల అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

Tags:    

Similar News