Family Property Dispute: భారత్ ఫోర్జ్ కంపెనీ ఛైర్మన్ బాబా కల్యాణి, ఆయన సోదరి సుగంధ హీరేమఠ్ మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావును మధ్యవర్తిగా నియమించింది. ఇరు పక్షాల మధ్య సమన్వయం కల్పించి, ఉభయపక్షాలు ఆమోదించే సమాధానం చూపడం ఆయన బాధ్యత.

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్ ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. అంతవరకు బాంబే హైకోర్టులో సంబంధిత విచారణను నిలిపివేయాలని కూడా ఆదేశించింది.

ఈ వివాదం 1994లో బాబా కల్యాణి, ఆయన తండ్రి నీలకంఠ అన్నప్ప కల్యాణి మధ్య కుదిరిన ఒప్పందం చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం కల్యాణి కుటుంబ నియంత్రణలో ఉన్న రసాయన సంస్థ హికల్ లిమిటెడ్‌ను తనకు బదిలీ చేయాలని సుగంధ హీరేమఠ్ కోరుతున్నారు. ప్రస్తుత వాటాలు పరిశీలిస్తే హీరేమఠ్ కుటుంబానికి 34.84%, కల్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు కలిపి 34.01% ఉన్నాయి. అయితే 1994 ఒప్పందం ప్రకారం 68.85% వాటాలు తమకు రావాలని హీరేమఠ్ వర్గం వాదిస్తోంది. ఆ ఒప్పందం ఆధారంగా వాటా కోరడాన్ని బాబా కల్యాణి వ్యతిరేకిస్తున్నారు.

గతంలో సుప్రీం కోర్టు, పుణె జిల్లా కోర్టు ముందు జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాంబే హైకోర్టు కూడా మే 4న మధ్యవర్తి నియామకాన్ని తిరస్కరించింది. దీంతో విషయం సుప్రీం కోర్టుకు చేరుకుంది.

ఈ కేసులో జస్టిస్ లావు నాగేశ్వరరావు మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ వివాదం సమస్యాత్మకంగా ముగిసి, పరస్పర అవగాహనతో ముగిసే అవకాశం ఏర్పడింది.

Tags: