Supreme Court: జవాబుదారీతనం ఉండాల్సిందే! నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Supreme Court: వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతో కష్టపడి, శ్రమించి పరీక్షకు సన్నద్ధమైన యువతను పదేపదే నిరాశకు గురి చేయడం సరికాదని స్పష్టం చేసింది.
శుక్రవారం జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. "వైఫల్యాలకు నిజమైన జవాబుదారీతనం ఉండకపోతే సమస్యకు ఎప్పటికీ పరిష్కారం ఉండదు. అప్పటి వరకు సమస్య పరిష్కారం కాదు" అని ధర్మాసనం అన్నది.
నీట్ పేపర్ లీక్‌పై ఎన్టీఏ రద్దు, పరీక్ష నిర్వహణలో మార్పులు కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్నా ప్రశ్నపత్రం ఎలా లీకైందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వైఫల్యం విద్యార్థులు, తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమని అభిప్రాయపడింది.
ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల్లోనే లోపాలు ఉండొచ్చని లేదా క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాకపోవచ్చని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇస్తూ, నీట్ రీ-షెడ్యూల్డ్ పరీక్ష ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్టీఏ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లో 2027 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేపర్-పెన్ను విధానానికి స్వస్తి చెబుతున్నట్లు తెలిపింది.
ఈ కేసు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుండటంతో, పరీక్ష నిర్వహణలో పూర్తి జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.