ఇటు ఏఐ అటు ట్రంప్... దారేది?
- అక్కడ చూస్తే ట్రంప్ వెళ్లగొడుతున్నాడు
- స్టూడెంట్ వీసా, జాబ్ వీసా, గ్రీన్ కార్డ్ ఉన్నా జాన్తానయ్
- ఇక్కడికొస్తే ఏఐ తరిమేస్తోంది
- 30-40 ఏళ్ల మధ్య వయస్కుల పరిస్థితి ఏంటి?
- అమెరికా పొమ్మంది సరే.. ఇండియా కూడానా?
- రోడ్డున పడుతున్న వీరికి మరో దారేది?
- చెదురుతున్న అమెరికా కలలు..
- నడివయస్కుల తరం నాశనమవ్వాల్సిందేనా?
అమెరికా అందమైన కల.. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం,స్థిరాస్థుల సంపాదన, హ్యాపీగా లైఫ్ గడపడం చాలా మందికి జీవితంలో ఇంత కన్నా పెద్ద కలలేం ఉంటాయి? అందరికీ ఉద్యోగాలు దొరకవు. మనదేశంలో క్లాస్ ఫోర్ ఎంప్లాయీ పోస్టుకు సైతం మంత్రి సిఫారసులు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ప్రభుత్వోద్యోగం సంపాదించడం కల్లే. అలాగని కార్పొరేట్ కంపెనీలు కూడా మన యువత ఉద్యోగ అవసరాలకు సరిపడ లేవు. పెరుగుతున్న జనాభా, ప్రభుత్వాలు అందిస్తున్న జనాకర్షక పథకాలతో పేదవాడు సైతం ఇంజనీరు, డాక్టరు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకోగలగుతున్నారు. మనదేశంలో నిరుద్యోగులు అంతకంతకూ పెరుగుతున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపుతానని వచ్చిన మోడీ ఆ విషయంలో మాత్రం వైఫల్యమే ఎదుర్కొన్నారు. దేశంలో ఉద్యోగాలు లేకనే మన యువత అమెరికాకు వలస పోతున్నారు. ఇక్కడ డిగ్రీ పట్టా చేతికి రాగానే అప్పోసప్పో చేసి అమెరికా విమానం ఎక్కడం అక్కడ బతుకు పోరాటం మొదలు పెట్టడం. పై చదువులు చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ వేల డాలర్లు కూడబెట్టి సొంతిళ్లకు పంపుతున్నారు. అందుకే చాలా మంది యువతకు అమెరికా ఒక తప్పని సరి ఆప్షన్ అయ్యింది. అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చిందంటే చాలు ఇక అమెరికా పౌరులు అయిపోయనట్లే... ముందు మూడు,నాలుగేళ్ల కోసం అని వెళ్లిన వారు సైతం గ్రీన్ కార్డు సంపాదించుకుని స్వదేశంలో వృద్ధ తల్లి దండ్రులను ఓల్డేజ్ హోమ్ ల పాల్జేసి అమెరికాలో సెటిల్ అవుతున్నారు. అమెరికా అంటే యువతకి భూతల స్వర్గం.మెరుగైన సంపాదన , హాయైన జీవితం, డిసిప్లీన్డ్ లైఫ్.. డబ్బుకి డబ్బు. అందుకే చలో అమెరికా నేటి యువత పాపులర్ స్లోగన్ అయిపోయింది.
కలలు కల్లలు చేసిన ట్రంప్...
కానీ అక్కడ ట్రంప్ గెలిచాక సీన్ మారిపోయింది. ఇప్పుడు ఇండియాని మించిన సురక్షిత దేశం లేదని పిస్తోంది. ట్రంప్ వచ్చాక ఇమ్మిగ్రంట్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకపడుతున్నాడు. స్టూడెంట్లను వెళ్లగొడుతున్నాడు. జాబ్ వీసా పై ఉన్న వారిని, గ్రీన్ కార్డు హోల్డర్లను ఇలా అందరినీ ఏదో రకంగా ఇబ్బందుల పాల్జేస్తున్నాడు.అక్కడ ఉండాలంటే సవాలక్ష ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాడు. మేథస్సుకు ఇండియా పెట్టింది పేరు. మెరికల్లాంటి స్కిల్డ్ వర్కర్స్ మన దగ్గర దొరికినంత, చవకగా మరెక్కడా దొరకరు. మన వాళ్లు చేసినంత నమ్మకంగా పనిచేసేవాళ్లు కూడా తక్కువే.. కానీ ఇప్పుడు ఈ ఆశ తల్లకిందులైంది.ఐఐటీ చదివిన వారికి సైతం అక్కడ ఉద్యోగాలు ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు వీసా రిటర్న్ చేసి వచ్చేయాల్సిందే.అమెరికాలో ఈ దురదృష్టకర వాతావరణం భారత యువతను కలవర పెడుతోంది. ఉన్నత చదువుల కోసం రెక్కలు కట్టుకు ఎగిరే వారికి అక్కడ నో ఎంట్రీ అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి.
అట్టు తిరగేసినట్లు మారిపోయిన సీన్...
అమెరికాలో ఈభిన్న వాతావరణం ఇన్నేళ్లలో ఎన్నడూ లేదు. ట్రంప్ వచ్చాక ఇలా సీన్ తల్లకిందులైంది. ఇమ్మిగ్రంట్లపైనా, అక్రమ స్మగ్లింగ్ పైనా, డ్రగ్ ట్రాఫికింగ్ పైనా ఉక్కుపాదం మోపుతానని చెప్పిన ట్రంప్ చెలరేగిపోతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ఊదరగొడుతున్నారు. విదేశీయులను గడగడలాడిస్తున్నారు. సవాలక్ష ఆంక్షల చట్రంలో బిగించి పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశీయులపై అక్కడున్న అమెరికన్లకు ద్వేషం నూరిపోస్తున్నారు.తమకు పోటీగా ఎదుగుతున్న దేశాలపై టారిఫ్ ల అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో ఉండాలంటే బిగ్ బాస్ తరహా షోలలో గెలిచి సిటిజన్ షిప్ కార్డు పొందాలని, ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కోవాలని కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ఫస్ట్ అన్న నినాదంతో అడుగులేస్తున్నారు. విదేశీ విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. వారి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. అమెరికా అంటే భూతల స్వర్గం అన్న కల చెదిరిపోయింది.
ట్రంప్ తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయన్న గ్యారంటీ లేదు.అలాగని అదే పార్టీ పాలసీ ఇలాగే ఉంటుందనీ లేదు. కానీ ఇప్పుడు అమెరికా ఫ్యూచర్ డెస్టినేషన్ గా పెట్టుబడులు పెట్టి చదువులు చదివిన వారి భవిష్యత్తే అగమ్య గోచరంగా తయారైంది.నేటి యువత తమ జీవిత కాలంలో ఎన్నడూ చూడని సంక్లిష్ట పరిస్థితులు ఇప్పుడు చూస్తోంది. వాట్ నెక్ట్స్ అన్నదానిపై ఐడియా లేదు.అమెరికా చుట్టూ అల్లుకున్న ఆశల గూడు చెదిరిపోయింది. ట్రంప్ ఉన్నంత కాలం ఇది ఇలాగే ఉంటుంది. అప్పటికి అమెరికన్లలో కూడా విదేశీ వ్యక్తుల పట్ల ట్రంప్ నాటిన ద్వేష బీజం మొగ్గతొడిగిందంటే అమెరికా ఇక అలాగే రణరంగంగానే ఉంటుంది. ట్రంప్ తర్వాతైనా పరిస్థితి మెరుగు పడుతుందన్న గ్యారంటీ లేదు. మరొకరు మళ్లీ ఇలాంటి క్రైసిస్ ను కలిగించరన్న నమ్మకం లేదు.
కృత్రిమ మేథ పెంచిన కృత్రిమ సంక్షోభం!!
ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక యువత ఉద్యోగాలు పోతున్నాయి. నలుగురు చేసే పని ఒక్క మిషనే చేయడం, మనుషుల కన్నా వేగంగా,కరెక్టుగా పనిచేయడంతో యాజమాన్యాలు కూడా ఏఐ తో తమ ఉద్యోగస్తుల అవసరాలు రాను రాను తగ్గించుకుంటున్నాయి.ఐటీ, రిటైల్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఏఐ ఆటోమేషన్ వర్క్ కల్చర్ పెరిగిపోతోంది.ఏఐ టెక్నాలజీ వల్ల ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది కోటీ 20లక్షల మంది ఉద్యోగాలు ఎగిరిపోతాయన్నది ఒక అంచనా. వీరంతా రోడ్డున పడితే పరిస్థితి ఊహించగలమా? లాజిస్టిక్స్, హెల్త్ కేర్, నిర్మాణ రంగం, తయారీ రంగంలలో బ్లూ కాలర్ జాబ్స్ సైతం ఏఐ కొల్లగొడుతుందన్నది ఒక అంచనా.
30-40 మధ్య వయస్కుల సంగతేంటి?
సమాజంలో యాభై ఏళ్లు దాటిన వారంటే రిటైర్మెంట్ ఏజ్ కు దగ్గర పడుతున్న వారికింద లెక్క. వారు ఈ వయసులో ఎక్కడికైనా వెళ్లి ఏదో సాధించేది ఉండదు. ఉన్న ఊరుని, ఉన్న ఉపాధిని నమ్ముకుని ఎలాగోలా బతికేస్తారు. ఏఐ రంగం రాకతో 20 ఏళ్లు దాటిన వారు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి తమ భవిష్యత్తుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటారు.
భవిష్య అవసరాలకు అనుగుణంగా వారి ఫ్యూచర్ ను డిసైడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వారికింకా ఎదిగే టైమ్ ఉంది కాబట్టి. కానీ 30 ఏళ్లు, 40 ఏళ్లు వచ్చిన వారి పరిస్థితి ఏంటి? చదువు పూర్తి చేసుకుని అవకాశాల కోసం బయటకొచ్చే వారికి ఇంటా, బయటా ఏమీ దొరకకపోతే ఏం చేస్తారు? అమెరికా అయినా, భారత్ అయినా ఉద్యోగాలకు ఆస్కారం లేనిచోట చదివిన చదువుకు తగిన న్యాయం జరగక సరైన ఉపాధి మార్గం లేక పెళ్లిళ్లు అవక,ఏ దారీ లేని వారిలా అయిపోతారు.ప్రైవేట్, కార్పొరేట్ రంగాలలో కూడా రిజర్వేషన్లు, రికమెండేషన్ల స్టేజి దాటిపోయి ఏఐ వర్క్ కల్చర్ వచ్చేశాక ఇక మానవ వనరుల అవసరమెక్కడ? 30 ఏళ్లు దాటిన వారి భవిష్యత్ అగమ్యగోచరమేనా? ఇది ట్రంప్ సృష్టించిన అలజడి అయినా భవిష్యత్తును కళ్లకు కడుతున్న ఒక నగ్న సత్యం.