Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌పై డీల్ ఆరోపణలు.. ‘నా దీక్ష పవిత్రం.. సర్టిఫికెట్ కావాలా?’ అంటూ ఆవేదన
ఆవేదన
Sonam Wangchuk: 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన తర్వాత కేంద్రంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వస్తున్న విమర్శలపై పర్యావరణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచే ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ తన నిజాయితీని ప్రశ్నించడం బాధాకరమని పేర్కొన్నారు.
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను విరమించారు. దీనితో సోషల్ మీడియాలో ‘డీల్’ జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి స్పందిస్తూ వాంగ్‌చుక్ “నేను చేసిన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకోవడానికి సర్టిఫికెట్ కావాలా? 26 రోజులు ఆకలితో ఉండి నా నిజాయితీని ఇంకా నిరూపించుకోవాలా?” అని ప్రశ్నించారు.
“డీల్ చేసుకోవాలనుకుంటే ఢిల్లీ ఎండలో రోడ్డు పక్కన కూర్చునే బదులు ఏసీ గదిలో కూర్చొని చేసేవాడిని. ఇందుకోసం నెల రోజుల పాటు ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీక్ష కారణంగా తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. 11 కిలోల బరువు తగ్గానని, కండరాలు క్షీణించాయని, శరీర అవయవాలు, మెదడుపై తీవ్ర ప్రభావం పడిందని, పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై స్పందిస్తూ, అది ముఖ్యమైన విషయమే అయినా నిరసనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే తనకు ప్రాధాన్యం అని చెప్పారు. అందుకే చర్చల సమయంలో రాజీనామా డిమాండ్ చేయలేదని, కొన్ని రోజుల్లో మంత్రి రాజీనామా చేస్తారని తనకు తెలుసని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన వేలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా, వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.