Trending News

Nobel laureate and renowned economist Amartya Sen: అమర్త్యసేన్ ఆందోళన: పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రక్రియలో హడావుడి ఎందుకు?

పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రక్రియలో హడావుడి ఎందుకు?

Update: 2026-01-24 13:48 GMT

Nobel laureate and renowned economist Amartya Sen: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను అత్యంత హడావుడిగా చేపట్టడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆయన ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

"ఇటువంటి ముఖ్యమైన ప్రక్రియలను చాలా జాగ్రత్తగా, సరైన సమయం తీసుకుని నిర్వహించాలి. కానీ, పశ్చిమ బెంగాల్ విషయంలో అలా జరగడం లేదని నా అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో ఎన్నికల సంఘం అధికారులకు కూడా తగినంత సమయం లేకుండా పోతున్నట్లు అనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించిన అనేకమంది భారతీయ పౌరుల మాదిరిగానే నాకు కూడా జన్మ ధ్రువీకరణ పత్రం లేదు. ఓటరుగా నా అర్హతను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి వచ్చింది. నా సమస్య పరిష్కారమైంది. అయితే, అందరూ ఇంత త్వరగా స్పందించలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? నా స్వంత నియోజకవర్గమైన శాంతినికేతన్‌లో నాకున్న ఓటు హక్కుపై అధికారులు ప్రశ్నలు సంధించారు. మరిన్ని వివరాలు అడిగారు. ఇవన్నీ ఇప్పటికే రికార్డుల్లో ఉన్నవే కదా?" అని అమర్త్యసేన్ ప్రశ్నించారు.

ఇదిలావుంటే, సర్ విచారణకు హాజరుకావాలంటూ అమర్త్యసేన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఆయన ఒక నోబెల్ గ్రహీత. దేశానికి గర్వకారణమైన వ్యక్తిని విచారణకు ఎలా పిలుస్తారు?" అని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్ ప్రక్రియను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సర్ ప్రక్రియ రెండో దశలో ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. గత ఏడాది మొదటి దశలో బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తి కాగా, ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదలైంది.

Tags:    

Similar News