Rahul Issues Strong Warning: దేశం వైపు ఆర్థిక తుపాను ముంచుకొస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెచ్చరిక విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రజలకు చేసిన పొదుపు సూచనలను స్వయంగా పాటించడం లేదని విమర్శించారు. విదేశీ పర్యటనలు తగ్గించాలని ప్రజలను కోరిన మోదీ తానే ఐరోపా దేశాల పర్యటనకు వెళ్లడం విపరీతమని ఎద్దేవా చేశారు.

తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోని బఛ్‌రావాలో మంగళవారం జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ, ‘‘ప్రపంచం త్వరలోనే తీవ్రమైన చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఇలాంటి సంక్షోభం మన జీవితాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. దీన్ని ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు.

ఈ సంక్షోభం ప్రభావం ఎవరిపై పడుతుందంటే... అదానీ, అంబానీలు తమ ప్యాలెస్‌లలో భద్రత మధ్య సురక్షితంగా ఉంటారని, కానీ రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం మారే వరకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

మోదీపై తీవ్ర విమర్శలు:

మోదీ రిమోట్‌ కంట్రోల్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేతుల్లో ఉందని రాహుల్‌ ఆరోపించారు. మోదీ విదేశాలకు వెళ్లి ఎప్‌స్టీన్‌ ఫైళ్ల నుంచి తనను రక్షించుకోవాలని, అదానీని కాపాడాలని వేడుకుంటారని విమర్శించారు.

ఈ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడుతూ, పెట్రోల్‌ ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం, అదానీకి అమెరికా నుంచి క్లీన్‌చిట్‌ తెప్పించడమే మోదీ విధానమని విమర్శించారు. ఆర్థిక విధానాల్లో ప్రభుత్వం విఫలమైందని, భాజపా నేతలకు ముందు చూపు లేదని ఖర్గే అన్నారు.

Tags: