Banner Dispute in Ballari: బళ్ళారిలో బ్యానర్ వివాదం: ఘర్షణలో ఒకరు మృతి, కాల్పులతో ఉద్రిక్తత
ఘర్షణలో ఒకరు మృతి, కాల్పులతో ఉద్రిక్తత
Banner Dispute in Ballari: కర్ణాటకలోని బళ్ళారి నగరంలో బ్యానర్లు కట్టే విషయాన్ని కేంద్రంగా చేసుకొని రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. గురువారం రాత్రి మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు ఈ ఘటన జరగడంతో పరిస్థితి చేయి దాటింది. రాళ్ల దాడి, బీరు సీసాలు విసిరే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. ఇరు వర్గాల కార్యకర్తలు గాయాలపాలయ్యారు.
వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నగరమంతా బ్యానర్లు, పోస్టర్లు కట్టే పనులు జరుగుతున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు రోడ్డుపై బళ్ళారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుయాయులు బ్యానర్లు కట్టడానికి ప్రయత్నించగా, ఆయన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం మొదలై, తోపులాటకు దారితీసింది. రెండు వర్గాల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఘర్షణ మరింత ముదిరింది. రాళ్లు, బీరు సీసాలు విసరుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఉద్రిక్తత తగ్గకపోవడంతో ఎస్పీ ఆదేశాల మేరకు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి స్థలానికి చేరుకున్నారు. ఆయన అనుయాయులు మరింత సంఖ్యలో తరలివచ్చారు. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐజీపీ వర్తికా కటియార్ స్థలాన్ని సందర్శించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గాలి ఆరోపణలు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన నివాసం ముందు విలేకరులతో మాట్లాడుతూ, నారా భరత్ రెడ్డి మరియు ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారి చుట్టూ గుండాలు ఉన్నారని, తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. బ్యానర్ వివాదాన్ని సాకుగా చూపి తన ఇంటిపై కాల్పులు జరిపారని, గుండ్రాలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భరత్ రెడ్డి స్పందన: ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మాత్రం ఈ ఘటనకు గాలి వర్గమే కారణమని ఆరోపించారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే ఇలాంటి ఘర్షణలకు పాల్పడుతున్నారని, వాల్మీకి అజ్జ వారి పాపాలను చూస్తారని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ ఘటనతో బళ్ళారి నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.