BJP Forms First Government in Bengal: బెంగాల్‌లో తొలి భాజపా సర్కారు.. సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం
సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం
BJP Forms First Government in Bengal: పశ్చిమ బెంగాల్‌లో భాజపా చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి భాజపా సర్కారు ఏర్పడింది. నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత సువేందు అధికారి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో గవర్నర్ ఆర్.ఎన్. రవి సువేందు చేత ప్రమాణం చేయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
55 ఏళ్ల సువేందు అధికారితో పాటు భాజపా నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ మంత్రులుగా ప్రమాణం చేశారు. సువేందు బెంగాల్‌కు 9వ ముఖ్యమంత్రి.
సువేందు రాజకీయ ప్రయాణం:
1970 డిసెంబరు 15న తూర్పు మేదినీపూర్ జిల్లాలో జన్మించిన సువేందు 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆమె నమ్మకస్తుడిగా ఎదిగారు. మమతా క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2020లో మమతా మేనల్లుడితో విభేదాల నేపథ్యంలో టీఎంసీని వీడి భాజపాలో చేరారు.
ఆ తర్వాత రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాను ఓడించిన సువేందు, ఈసారి భవానీపూర్‌లోనూ ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయంలో సువేందు కీలక భూమిక పోషించారు.
ఈ ప్రమాణస్వీకారం బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.