Rahul Gandhi: రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దుకు బీజేపీ ఎంపీ నోటీసు: జీవితాంతం ఎన్నికలు పోటీ చేయకుండా చర్యలు కోరుతూ డిమాండ్
జీవితాంతం ఎన్నికలు పోటీ చేయకుండా చర్యలు కోరుతూ డిమాండ్
సభాపతికి నిశికాంత్ దుబే వినతి - భారత వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు ఆరోపణలు
Rahul Gandhi: లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భాజపా ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఎంపీ పదవి నుంచి తొలగించడంతో పాటు, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు సమర్పించారు.
ఈ మేరకు 'సబ్‌స్టాంటివ్ మోషన్' ప్రతిపాదించాలని ఆయన లోక్‌సభలో శూన్యగంటలో డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తరచూ థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు వెళ్లి, సారోస్ ఫౌండేషన్, యూఎస్‌ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో చేతులు కలిపి భారత వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నారని దుబే ఆరోపించారు.
పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరింత స్పష్టం చేశారు: "రాహుల్ గాంధీకి ఎవరు నిధులు ఇస్తున్నారు? ప్రచురితం కాని ఆత్మకథ పుస్తకం ఆయన చేతికి ఎలా వచ్చింది? భారత వ్యతిరేక శక్తులతో ఆయనకున్న సంబంధాల గురించి నోటీసులో ప్రస్తావించాను."
ఈ నోటీసు, ఆరోపణలపై విపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.
ఇంతకుముందు పార్లమెంటు ఉభయసభలు 'పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు-2026'ను ఆమోదించాయి. బడ్జెట్ సమావేశాల తొలివిడతలో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇది.
పోరాటం ఆపను...
రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, తనపై ఏ చర్యలు తీసుకున్నా రైతుల పక్షాన బలంగా పోరాడతానని స్పష్టం చేశారు. అన్నయ్యను ఎవరూ బెదిరించలేరని ఆయన సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు.
మరోవైపు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాహుల్‌ను 'పెద్ద అబద్ధాలకోరు' అని తీవ్రంగా విమర్శించారు. దేశంలో అంతర్యుద్ధం కోరుకుంటున్నారని, ఆయన నకిలీ రైతు అని, బార్లీ-గోధుమ, పెయ్య-పడ్డ మధ్య తేడాలు కూడా తెలియవని ఆరోపించారు.