Brij Bhushan: బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామ్‌దేవ్ ప్రారంభించిన స్వదేశీ ప్రచారంలో ఇప్పుడు నకిలీ ఉత్పత్తులు, విదేశీ వస్తువులు చేరాయని ఆయన ఆరోపించారు.

గతంలో రామ్‌దేవ్ చేపట్టిన ఉద్యమాలు సమంజసంగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆయన విధానాలు మారిపోయాయని శరణ్ సింగ్ అన్నారు. రామ్‌దేవ్ మళ్లీ ఉద్యమం చేయదలిస్తే సింధూరం, సల్వార్ ధరించి రాకుండా ఒక మగాడిలాగా నిరసన తెలిపి నిర్ణయాత్మక పోరాటం చేయాలని సవాల్ విసిరారు. దేశంలో విరివిగా లభిస్తున్న కల్తీ నెయ్యికి రామ్‌దేవే ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణ చేశారు. అంతేకాకుండా, రామ్‌దేవ్ కంపెనీ ఇప్పుడు విదేశీ లోదుస్తులను కూడా తయారు చేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. 2022లో పతంజలి బ్రాండ్ పేరును ఉపయోగించవద్దని బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు. మహర్షి పతంజలి జన్మస్థలమైన గోండా అభివృద్ధికి వారు ఎలాంటి సేవ చేయలేదని ఆరోపించారు. 2023లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు బాబా రామ్‌దేవ్ రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

Tags: