NTA: ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫీజుపై ఎన్‌టీఏ స్పష్టత.. ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? రీఫండ్ ఉందని వెల్లడి
రీఫండ్ ఉందని వెల్లడి
NTA: యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించిన ఫీజుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సంస్థ స్పష్టత ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేయడం వల్ల అభ్యర్థులపై అధిక భారం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందిస్తూ ఎన్‌టీఏ.. ఫీజు చెల్లింపు ప్రక్రియపై వివరణ ఇచ్చింది. అభ్యంతరాలు సరైనవైతే రీఫండ్ ఉంటుందని స్పష్టం చేసింది.
‘‘ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ఈ ఆన్సర్ కీ ఛాలెంజ్ సిస్టమ్‌ను రూపొందించాం. ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానంపై ఎవరైనా విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తారు. ఒకవేళ సదరు విద్యార్థి అభ్యంతరం సరైనది అయితే.. ఆన్సర్ కీని సవరిస్తాం. కొత్త సమాధానం పరీక్ష రాసిన విద్యార్థులందరికీ వర్తిస్తుంది. సదరు అభ్యర్థి ఛాలెంజ్ సరైనదే అని రుజువైతే ఆ ప్రశ్నకు చెల్లించిన మొత్తం రీఫండ్ చేస్తాం. అర్థంలేని అభ్యంతరాలు రాకుండా ఉండేందుకే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజును నిర్ణయించాం. అంతేగానీ.. దీన్నుంచి లాభం పొందడానికి కాదు’’ అని ఎన్‌టీఏ వెల్లడించింది.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశం కోసం నిర్వహించిన సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ప్రాథమిక కీను ఎన్‌టీఏ ఇటీవల విడుదల చేసింది. ఆన్సర్ కీలో ఏదైనా సమాధానం తప్పుగా ఉందని అభ్యర్థులు భావిస్తే.. ప్రతి ప్రశ్నకు రూ.200 చెల్లించి కీపై తమ అభ్యంతరాలను తెలియచేయొచ్చని ప్రకటించింది. జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించింది. అయితే, ఇందులో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో వివిధ రకాల లోపాలపై ఫిర్యాదులు రావడంతో ఆ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సబ్జెక్టులకు సెప్టెంబరులో మరోసారి పరీక్ష నిర్వహించనుంది.