Centre Denies Rumours: పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 పెరుగుతాయన్న ప్రచారం.. కేంద్రం ఖండన
కేంద్రం ఖండన
Centre Denies Rumours: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25–28 వరకు పెరగనున్నాయంటూ మీడియాలో వెలువడిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
సోషల్ మీడియా, కొన్ని వార్తా కథనాల్లో ఎన్నికల తర్వాత ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగించింది. అయితే, ఇలాంటి ధరల పెంపుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఇలాంటి వార్తలు ప్రజల్లో భయం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవని, అవి తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ పేర్కొంది.
అంతేకాకుండా, గత కొన్ని సంవత్సరాల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కలిసి చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించింది. ప్రజలపై ధరల భారం పడకుండా చూడటమే తమ లక్ష్యమని తెలిపింది.
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వంటి కారణాలతో ధరలు పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.25–28 పెంపు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని కేంద్రం పూర్తిగా ఖండించింది.