Great Nicobar Project: గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: రూ.13 వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయం

రూ.13 వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయం

Update: 2026-06-09 10:15 GMT

Great Nicobar Project: కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి ప్రాజెక్ట్ (GNI) కింద రూ.13 వేల కోట్ల వ్యయంతో కొత్త పౌర-సైనిక విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ వద్ద రన్‌వే విస్తరణ ప్రణాళికను పక్కనబెట్టి, గలాథియా బే సమీపంలోని చింగెన్ ప్రాంతంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించనుంది. రాబోయే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం.

అండమాన్‌-నికోబార్ దీవులను ఆర్థిక, వ్యూహాత్మక కేంద్రంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రూ.81 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టబడింది. ఈ ప్రాజెక్టు కింద మౌలిక సదుపాయాల్లో విమానాశ్రయం కీలకమైనది. మలక్కా జలసంధికి అతి సమీపంలో ఉన్న నికోబార్ దీవి స్థానం వల్ల ఈ ప్రాజెక్టుకు ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. చైనాకు చెందిన 80 శాతం చమురు, 70 శాతం సహజ వాయువు రవాణా ఈ జలసంధి గుండా జరుగుతుండటంతో, యుద్ధ నౌకలు, వైమానిక సదుపాయాలు ఏర్పాటు చేయడం దేశ రక్షణకు కీలకమని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి.

భౌగోళిక పరిమితుల కారణంగా ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించడం సాధ్యం కాకపోవడంతో కొత్త స్థలంలో నిర్మాణం నిర్ణయించారు.

ఈ ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్టు దేశ సహజ వారసత్వం, గిరిజనుల జీవన విధానానికి ముప్పుగా ఉందని ఆరోపించారు. ప్రాజెక్టు వల్ల 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షలాది చెట్లు నరికివేయాల్సి వస్తుందని, ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసమని మండిపడ్డారు.

పర్యావరణపరంగా సున్నితమైన ఈ దీవిలో ప్రాజెక్టు అమలు ఎలా జరుగుతుందనేది ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్రం మాత్రం ఆర్థిక, రక్షణ, మౌలిక అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News