Chaos During Messi’s Visit to Salt Lake Stadium: మెస్సి సాల్ట్ లేక్ స్టేడియం పర్యటనలో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం
అభిమానుల ఆగ్రహం
Chaos During Messi’s Visit to Salt Lake Stadium: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సి 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కోల్‌కతాలోని వివేకానంద యువభారతి క్రీడాస్థలి (సాల్ట్ లేక్ స్టేడియం)లో శనివారం జరిగిన కార్యక్రమం గందరగోళంగా మారింది. మెస్సిని దగ్గరగా చూడాలని, అతని మాటలు వినాలని భారీ ధరలు చెల్లించి టికెట్లు కొన్న అభిమానులు.. కేవలం 10 నిమిషాల్లోనే స్టేడియం నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్న మెస్సి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో స్టేడియానికి వచ్చాడు. అప్పటికే వేలాది మంది అభిమానులు స్టేడియంలో తరలివచ్చారు. అయితే రాజకీయ నాయకులు, మాజీ ఫుట్‌బాలర్లు, కోచ్‌లు, నిర్వాహకులు మెస్సిని చుట్టుముట్టడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులకు అతన్ని స్పష్టంగా చూడే అవకాశం లభించలేదు. భద్రతా కారణాలతో ముందుగా ప్రణాళిక చేసిన కార్యక్రమాలను నిర్వహించకుండానే 10 నిమిషాల్లోనే మెస్సిని నిర్వాహకులు తీసుకెళ్లిపోయారు.
ఇది చూసిన అభిమానులు సహనం కోల్పోయారు. రూ.4,500 నుంచి రూ.10,000 వరకు టికెట్లు కొని గంటల తరబడి ఎదురుచూసినవారు.. మెస్సి నోట ఒక్క మాట కూడా వినకపోవడంతో ఆగ్రహం వెల్లువెత్తింది. వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేస్తూ, టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. స్టేడియం గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన అభిమానులను నియంత్రించడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. దాదాపు గంటపాటు ఈ అల్లరి కొనసాగింది.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ మెస్సికి క్షమాపణలు చెప్పారు. ఘటనపై దర్యాప్తు ఆదేశించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మెస్సి 72 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే భారత్‌లో గడుపుతున్నాడు. కోల్‌కతా తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లో కార్యక్రమాలు ఉన్నాయి. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత అతని పర్యటన ముగుస్తుంది.