Uttarakhand Cloud burst : ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్
నీట మునిగిన వందలాది నివాస గృహాలు;
రెండు వారాల వ్యవధిలో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. తరచు జరిగే క్లౌడ్ బరెస్టుల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా థరలీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో కుండ పోత వర్షం కురిసి భారీ వరదలు వాటిల్లాయి. ఈ వరదల కారణంగా వందలాది నివాస ప్రాంతాలు నీట మునిగి పోయాయి. అనేక మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు బురదలో కూరుకుపోయాయి. భారీ వరదల కారణంగా థరలీ ప్రాంతంలో పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు. అకస్మాత్తుగా సంభవించిన వరదల సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వరదల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి థరాలిలో క్లౌడ్ బరస్ట్ సంభవించినట్లు వెల్లడించారు. సీయం పుష్కర్‌సింగ్ స్థానిక ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్ధితులుపై సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వర్షాకాలంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌లు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీగా వరదలు వచ్చి నివాస ప్రాంతాలన్నీ బురద మయం అయిపోతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మిక్కిలిగా పౌరులు గల్లంతయ్యారు. వరదల కారణంగా ప్రధాన రహదారులు దెబ్బతిని రవాణకు కూడా ఆటంకం ఏర్పడుతోంది.