Priyanka Gandhi’s Son: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాడ్రా కుమారుడు, విజువల్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్ రైహాన్ వాడ్రా బికానేర్ హౌస్‌లో నిర్వహించిన ప్రదర్శన నుంచి అనేక ఫోటోలు తొలగించినట్లు ఆయన ఆరోపించడంతో వివాదం చెలరేగింది.

‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ అనే శీర్షికతో బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో వన్యప్రాణుల ఫోటోగ్రఫీ, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌తో పాటు ఇటీవలి యువత నిరసనలు, ఉద్యమాలను చిత్రీకరించిన ఫోటోలు ఉన్నాయి. అయితే బికానేర్ హౌస్ మేనేజ్‌మెంట్ ప్రదర్శన ప్రారంభానికి కొన్ని గంటల ముందు చాలా ఆర్ట్‌వర్క్‌లను తొలగించాలని బలవంతం చేసినట్లు రైహాన్ వాడ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

“ఐదు గంటల క్రితం బికానేర్ హౌస్ మేనేజ్‌మెంట్ నా షోలో ప్రదర్శించిన చాలా ఆర్ట్‌వర్క్‌లను తొలగించాలని బలవంతం చేసింది. ఇవి ఢిల్లీలోని యువత నిరసనల ఫోటోలు. కంటెంట్ అభ్యంతరకరమని చెప్పారు” అని ఆయన రాశారు. తిరంగా ఫోటోలు రెండింటిని కూడా తొలగించాలని సూచించినట్లు ఆయన ఆరోపించారు. “నేను నిరాకరించాను. భారత జాతీయ జెండా ఫోటోను తీసేయను. ఇప్పుడు షో కొంత మేరకు కొనసాగుతుంది. మిగతా నిరసన ఫోటోలను మరో వేదికలో ప్రదర్శిస్తాను” అని పేర్కొన్నారు.

ఆర్గనైజర్లు “ఇలాంటి చిత్రాలు ప్రదర్శించడానికి సరైన సమయం కాదు” అని చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. ప్రదర్శన వివరాలు, ప్రతిపాదనలు ముందుగానే మేనేజ్‌మెంట్‌కు పంపించానని రైహాన్ వాడ్రా వాదించారు.

ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ, మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేరా స్పందిస్తూ, “నిరసన ఫోటో తీయడంలో ఏమైనా తప్పుందా? తిరంగా కూడా సెన్సార్ కత్తెరకు గురైతే సమస్య ఆర్ట్‌లో కాదు.. పాలనలో ఉంది” అని ఎక్స్‌లో రాశారు. ఈ ఫోటోలు కేవలం నిరసనలను డాక్యుమెంట్ చేశాయని, ఏ ఒక్కటీ అవమానకరం లేదా ఉద్రేకపూరితం కాదని పేర్కొన్నారు. “ఆలోచనలకు భయపడే ప్రభుత్వం నిరసనలు, నిరసన ఫోటోలు, తిరంగా కూడా సహించలేకపోతే ముగింపు దగ్గర పడిందని అర్థం” అని అన్నారు.బికానేర్ హౌస్ రెసిడెంట్ కమిషనర్ రోహిత్ కుమార్‌ను సంప్రదించినా ఆయన స్పందించలేదు.

Tags: