Rahul Gandhi: ఎప్‌స్టీన్-పూరి ఫోటో విడుదల సమయంపై రాహుల్ గాంధీ ప్రశ్న.. అమెరికా ఎవరిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది?
బ్లాక్‌మెయిల్ చేస్తోంది?
Rahul Gandhi: అమెరికా న్యాయశాఖ (డీవోజే) జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫోటోను విడుదల చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విడుదల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబై పర్యటనతో సమానంగా జరగడం గమనార్హం.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “రూబియో ముంబైకి వెళ్తున్నారు. అమెరికా డీవోజే ఎప్‌స్టీన్, పూరి ఫోటోను విడుదల చేసింది. ప్రియమైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలారా.. అమెరికా ఎవరిని బ్లాక్‌మెయిల్ చేస్తోందని మీరు అనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా పూరిపై విమర్శలు గుప్పించారు. పూరి గతంలో ఎప్‌స్టీన్‌ను అధికారిక ప్రతినిధి బృందాల్లో భాగంగా మూడు-నాలుగు సార్లు కలిశానని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఎప్‌స్టీన్ పాజీ మూడు-నాలుగు సార్లు మాత్రమే కలిశానన్నారు. ఈ రెండు ఫోటోల్లో మిగతా ప్రతినిధులు బహుశా టేబుల్ కింద దాక్కున్నారేమో” అని వ్యంగ్యంగా అన్నారు. “కొంచెం సిగ్గు పడండి.. కనీసం ఇప్పుడైనా క్యాబినెట్ సమావేశాలకు రాకండి” అని మరో పోస్ట్‌లో రాశారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా పూరి వాదనను ప్రశ్నించారు. డీవోజే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పత్రాలను ఉటంకిస్తూ, 2014 నుంచి 2017 మధ్య ఇద్దరి మధ్య 62 ఇమెయిల్‌లు మార్పిడి అయ్యాయని, 14 సమావేశాలు జరిగాయని, వాటిలో చాలా వన్-ఆన్-వన్ సమావేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. “ఇటీవలి ఫోటోలు మా వాదనలను మరింత బలపరిచాయి. ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి” అని ఆయన ఎక్స్‌లో రాశారు.