Delhi Encounter: దిల్లీ ఎన్‌కౌంటర్‌: ప్రతి నెలా ఓ నేరం.. కిరాయి హత్యలు: ముగిసిన ‘సిగ్మా గ్యాంగ్‌’ భయానక చర్యలు!

ముగిసిన ‘సిగ్మా గ్యాంగ్‌’ భయానక చర్యలు!

Update: 2025-10-23 08:01 GMT

Delhi Encounter: దిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం ఉదయం భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మోస్ట్‌వాంటెడ్‌ సిగ్మా గ్యాంగ్‌ సారథి సహా నలుగురు నేరస్థులు మరణించారు. బిహార్‌కు చెందిన ఈ ముఠా, ఆ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ (Delhi Encounter) జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై బిహార్‌ డీజీపీ వినయ్‌ కుమార్‌ స్పందిస్తూ, వీరు కాంట్రాక్ట్‌ కిల్లర్లని వెల్లడించారు.

‘‘సిగ్మా అండ్‌ కంపెనీ (Bihar Sigma Gang) అనే ఈ గ్యాంగ్‌ సభ్యులు దాదాపు ప్రతి నెలా ఓ నేరానికి పాల్పడేవారు. కిరాయి హత్యలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) సమీపిస్తున్న తరుణంలో వీరిపై మా దృష్టి పెంచాం. ఇంటెలిజెన్స్‌ సమాచారంతో దిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకున్నాం. ఇరు రాష్ట్రాల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరి ఆచూకీ లభించింది. అక్కడికి చేరుకోగానే వారు మా పోలీసులపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. సాధారణంగా నేరాలకు ముందు రాష్ట్రం బయటకు వెళ్లి పథకాలు రచించి, తిరిగి వచ్చి అమలు చేసేవారు. ఈసారి కూడా అదే జరిగి ఉండవచ్చు. ఎన్నికల సమయంలో వీరి కుట్రలను సమర్థవంతంగా అడ్డుకున్నాం’’ అని బిహార్‌ డీజీపీ వినయ్‌ కుమార్‌ తెలిపారు.

ఈ ముఠా నేత రంజన్‌ పథక్‌. తాజా ఎన్‌కౌంటర్‌లో రంజన్‌ (25), బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) మరణించారు. బిహార్‌లోని సీతామర్హి ప్రాంతంతోపాటు ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, నేపాల్‌ సరిహద్దుల్లో ఈ గ్యాంగ్‌ చురుగ్గా కదలాడేది. బిహార్‌లో బ్రహ్మశ్రీ సేనా నేతలు గణేశ్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్‌ల హత్యల్లో ఈ ముఠా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీలు వంటి అనేక కేసుల్లో వీరు మోస్ట్‌వాంటెడ్‌లుగా ఉన్నారు. గతంలో ఓసారి రంజన్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి బిహార్‌ పోలీసులు ప్రయత్నించినప్పటికీ, అప్పుడు తప్పించుకున్నాడు.

Tags:    

Similar News