Badrinath Donation Irregularities: బద్రీనాథ్ విరాళాల అక్రమాలు: ధామి ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
విచారణకు ఆదేశం
Badrinath Donation Irregularities: బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.
ఆలయ విరాళాల వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా సంస్కరణలు చేపట్టడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు. విచారణ అనంతరం బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC)కు తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. BKTC ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌తో పాటు మరో 44 ఆలయాలు, పాఠశాలలు, ధర్మశాలలను నిర్వహిస్తోంది.
అధికారులు ఆలయ ప్రాంగణంలోని CCTV ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నారు. విరాళాల రికార్డులు, నగదు నిర్వహణ, సేకరణ విధానాలు, లెక్కలు మరియు సంబంధిత పత్రాలన్నింటినీ పరిశీలించి వ్యవస్థాగత లోపాలను గుర్తించి సరిదిద్దే పనులు చేపట్టారు.
ఇదిలా ఉండగా, BKTC ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు.
ఈ చర్యలు ఆలయ విరాళాల్లో పారదర్శకతను బలోపేతం చేసి భక్తుల విశ్వాసాన్ని కాపాడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.