DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక.. జూన్ 3న ప్రమాణస్వీకారం
జూన్ 3న ప్రమాణస్వీకారం
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా డీకే శివకుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా, సీనియర్ నేత పరమేశ్వర్ బలపరచారు. ఎమ్మెల్యేలంతా ఏకాభిప్రాయంతో ఆయన్ను ఎన్నుకున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపాయి.
సిద్ధరామయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న నాయకత్వ మార్పు ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. డీకే శివకుమార్ త్వరలో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం కోరనున్నారు.
కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అలాగే ప్రస్తుత మంత్రుల్లో సగం మందికి మళ్లీ చోటు దక్కకపోవచ్చని సమాచారం. సిద్ధరామయ్య దిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు కొత్త మంత్రుల జాబితా అందించినట్లు తెలుస్తోంది.
ఈ మార్పులతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఊపు పొందే అవకాశాలున్నాయి.