Rijiju: ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు జేపీసీకి.. మైనారిటీలపై వివక్ష లేదని రిజిజు వెల్లడి
రిజిజు వెల్లడి
Rijiju: లోక్‌సభలో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ తీర్మానాన్ని లోక్‌సభ వాయిస్ వోట్ ద్వారా ఆమోదించింది.
మొత్తం 31 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటు కానుంది. ఇందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. బిల్లుపై వివరంగా చర్చించి, అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కమిటీ అవకాశం కల్పిస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. “మైనారిటీలు, ఎన్‌జీఓలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా “మొత్తం విపక్షాలు ఈ బిల్లుకు వ్యతిరేకం. ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకొచ్చిన ఏ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదు?” అని ప్రశ్నించారు.
ఇందుకు స్పందిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సవాలు విసిరారు. “అఖిలేష్ యాదవ్‌గారికి సవాలు విసురుతున్నాను. ఈ బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకమైన ఒక్క నిబంధనైనా చూపించండి. దేశంలో అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. భారత్ బనానా రిపబ్లిక్ కాదు. చట్టపరమైన నియమాలు లేకుండా విదేశీ నిధులు దేశంలోకి రాకూడదు. ఈ బిల్లు దేశ భద్రత కోసం. ఏ మైనారిటీ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సహా విపక్షాలు గతంలోనే బిల్లును కమిటీకి పంపాలని డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఉపసంహరించాలని అంటున్నారని రిజిజు విమర్శించారు. జేపీసీలో అన్ని అభ్యంతరాలు చర్చించుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ బిల్లు ఎన్‌జీఓలు, విదేశీ నిధులపై మరింత కఠిన నియంత్రణలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసం ఇది అవసరమని ప్రభుత్వం పేర్కొంటోంది.