ఇంధన ఆందోళనల నేపథ్యంలో లాక్‌డౌన్ భయాలు వ్యాప్తమవుతున్నాయి.. కేంద్రం ఖండించింది


Government of India Clarifies: పశ్చిమాసియా వైపు ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాల్లో ‘లాక్‌డౌన్’ వస్తుందనే వదంతులు తీవ్రంగా వ్యాప్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పష్టమైన స్పందన ఇచ్చారు. లాక్‌డౌన్‌పై వినిపిస్తున్న ఊహాగానాలు, వదంతులు పూర్తిగా అవాస్తవం అని కేంద్రం తెలిపింది. అలాంటి ఏ ప్రతిపాదనా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.

మంత్రి హర్దీప్ సింగ్ పురీ వరుస ట్వీట్ల ద్వారా ఈ విషయాన్ని వివరించారు. “అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధనం, సరఫరా గొలుసు, అత్యవసర సరుకుల రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

అయితే, లాక్‌డౌన్‌పై వస్తున్న వదంతులు సమాజంలో గందరగోళం సృష్టిస్తాయని, ప్రజలకు హాని చేస్తాయని మంత్రి హెచ్చరించారు. ఈ సమయంలో అందరూ ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వం ఇంధన సరఫరా సాఫీగా కొనసాగేలా చూస్తోందని, ఎలాంటి కొరత ఉండదని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రజలు అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా, సాధారణ జీవన విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్లారిటీతో ప్రజల్లో ఉన్న ఆందోళన కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేసేవారిపై నిఘా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags: