Uddhav Thackeray Alleges: ‘హిందువుల భక్తి ధనాన్ని దోచుకుంటున్నారు’.. ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణ

ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణ

Update: 2026-07-06 13:55 GMT

Uddhav Thackeray Alleges: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య రామాలయం విరాళాల చోరీ ఆరోపణలపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువుల్ని దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని, ఒక దోపిడీదారుడిని అతని దోపిడీపై దర్యాప్తు చేయమని ఎలా అడగాలని నర్మగర్భంగా ప్రశ్నించారు.

ఆదివారం ముంబయిలో 'రామ్ రక్ష' పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. అయోధ్య విరాళాల వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హిందుత్వాన్ని దుర్వినియోగం చేసి ఆలయ ధనాన్ని ఎవరైనా దోచుకుంటే హిందువులు క్షమించరని స్పష్టం చేశారు. రాముడు అందరి వాడని, 'బీజేపీ రహిత రాముడి' కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రాలను పఠించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "ఇన్నాళ్ల తర్వాతైనా ఠాక్రేకు రాముడు గుర్తుకు రావడం సంతోషకరం" అని దాదర్‌లో వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కూడా స్పందించారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో దర్యాప్తు అనంతరం దోషులకు కఠిన శిక్షలు విధించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్రంగా బీజేపీపై ఆరోపణలు చేసింది. ఓటు చోరీ, సీటు చోరీ, చందా చోరీ అనే త్రిముఖ వ్యూహం అనుసరిస్తోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రామాలయ విరాళాల లూటీకి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత వహించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాత్రం ప్రతిపక్ష నేతల ఆరోపణలపై విచారణ జరపాలని అయోధ్య పోలీసులకు లేఖ రాసింది. హిందూ విశ్వాసాలను అవమానించడం విపక్షాల సంప్రదాయమని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు.

ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ ట్రస్టు సమావేశం సోమవారం జరగనుంది. విరాళాల వ్యవహారంలో తనకు పాత్ర లేదని కోశాధికారి గోవింద్ దేవ్ గిరి స్పష్టం చేశారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.

Tags:    

Similar News