Vijay’s Strong Remarks: అవినీతి ప్రశ్నలకు లక్ష్యంగా మారాను: విజయ్ తీవ్ర వ్యాఖ్యలు

విజయ్ తీవ్ర వ్యాఖ్యలు

Update: 2026-02-23 12:44 GMT

Vijay’s Strong Remarks: ప్రభుత్వాల అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తూ పోరాడుతున్నందుకే తనను అందరూ టార్గెట్ చేస్తున్నారని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం తమ పార్టీ సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతోందని, దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలిసే అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వేలూర్‌లో జరిగిన బహిరంగ సభలో విజయ్ ఈ మేరకు మాట్లాడారు.

రాష్ట్రంలో అవినీతి, నేరాలను నియంత్రించడంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ విమర్శించారు. రానున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు, తమిళనాడు ప్రజలు మరియు అవినీతి ప్రభుత్వం మధ్య జరిగే యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలు తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తనను ఎలాంటి విధంగానైనా ఓడించాలని స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేయడం భాజపాకు వేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఓటమి భయంతో స్టాలిన్ ప్రభుత్వం భాజపాతో సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. పరిస్థితులకు తగ్గట్టు మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటే అని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో శాంతి, భద్రతలను పటిష్టపరచడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని విజయ్ చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే ఉచిత శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సురక్షితమైన, పరిశుభ్రమైన బాత్రూం సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. తమిళనాడును దేశంలోనే అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు.

Tags:    

Similar News