Arvind Kejriwal: మద్యం కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు- అరవింద్ కేజ్రీవాల్
నన్ను అన్యాయంగా ఇరికించారు- అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: అధికార భారతీయ జనతా పార్టీ (భాజపా) గద్దె దిగేందుకు 'కౌంట్‌డౌన్' మొదలైందని ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సభలో ఆయన ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేజ్రీవాల్.. మద్యం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఇటీవల ఆ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు తీర్పు చరిత్రాత్మకమని, తాను నీతిపరుడని రుజువైందని అన్నారు.
"మోదీ ఎవరిని చూసినా భయపడిపోతున్నారు. శాస్త్రవేత్త, బాలల విద్య కోసం పనిచేసిన వాంగ్‌చుక్‌కు భయపడి ఆయనను జైలుకు పంపారు. మహిళా ఎంపీల దాడి భయంతో పార్లమెంటుకు వెళ్లలేదు. ట్రంప్‌కు కూడా మోదీ భయపడతారు. ఒక నియంత భయపడితే అది ఆ పాలనకు ముగింపని అర్థం" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
మోదీకి దేశమంటే లెక్కలేదని, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతూ అధికారంలో ఉన్నారని ఆరోపించారు. గత 12 ఏళ్ల భాజపా పాలనలో మౌలిక వసతులతో సహా దేశంలో నాశనం కాని రంగమే లేదని విమర్శించారు.
2011లో జంతర్‌మంతర్ సభ కాంగ్రెస్ పాలనను కూల్చివేసిందని గుర్తుచేస్తూ.. ఇప్పుడు జరుగుతున్న సభతో తొందరలోనే భాజపాకు కూడా అదే గతి పట్టేందుకు కౌంట్‌డౌన్ మొదలైందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా, ఆతిశీ, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.