Mamata Banerjee: అవసరమైతే పార్టీ కార్యాలయాలకు నేనే రంగులు వేస్తా: మమతా బెనర్జీ

నేనే రంగులు వేస్తా: మమతా బెనర్జీ

Update: 2026-05-16 11:10 GMT

పశ్చిమబెంగాల్‌లో భారీ ఓటమి నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘోర పరాజయం పాలవడంతో పార్టీలో అంతర్గత అసంతృప్తి, విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కాళీఘాట్‌లోని తన నివాసంలో మమతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కూడా పాల్గొన్నారు. సమావేశంలో మమతా మాట్లాడుతూ, “పార్టీ మారాలనుకునేవారు వెళ్లిపోవచ్చు. నేను కొత్తగా పార్టీని నిర్మిస్తాను. ఇందులో ఉండాలనుకునేవారు ఉండండి. దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించండి. వాటికి రంగులు వేయండి. అవసరమైతే నేనే రంగులు వేస్తాను” అని స్పష్టం చేశారు.

“టీఎంసీ ఎప్పటికీ తల వంచదు. ప్రజల తీర్పును కొందరు దొంగిలించారు. సత్యమే గెలుస్తుంది” అని మమతా ధీర్ఘంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశం తర్వాత టీఎంసీ అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఫోటోలు పోస్ట్‌ చేస్తూ “టీఎంసీ ఒక కుటుంబంలా ఐక్యంగా నిలుస్తుంది. ప్రజల తీర్పును దోచుకునే వారి ముందు మేం తలవంచం” అని రాసింది.

ఎన్నికల ఫలితాల తర్వాత మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, చాలామంది ఇతర పార్టీలకు వెళ్లవచ్చని, వారిని ఆపేది లేదని కూడా తెలిపారు.

ఎన్నికల ఫలితాలు: 294 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కేవలం 80 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మమతా బెనర్జీకి కంచుకోటగా భావించిన భవానీపుర్‌లోనే ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలో కొత్త చర్చలు, వ్యూహాలు ముందుకు వచ్చాయి.

మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను మరింత ఐక్యం చేసి, భవిష్యత్‌ కార్యాచరణకు దారి చూపుతాయని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News