Justice Surya Kant Appointed as Next CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్: బీఆర్ గవాయ్ స్థానంలో నియామకం!

బీఆర్ గవాయ్ స్థానంలో నియామకం!

Update: 2025-10-27 14:38 GMT

Justice Surya Kant Appointed as Next CJI: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ తన వారసుడిగా ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖలో ఈ విషయాన్ని గవాయ్ తెలిపారు. ఇటీవల కేంద్రం వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్‌మోస్ట్ జడ్జిని సీజేఐగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, జస్టిస్ సూర్యకాంత్ దేశ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌లో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి నిర్మూలన, పర్యావరణ సంరక్షణ, లింగ సమానత్వం వంటి అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో ఆయన భాగస్వాములయ్యారు. ఇటీవల బిహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వ్ చేయాలని చారిత్రాత్మక ఆదేశాలు ఇచ్చారు. 2022లో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తుకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటును ఆదేశించిన బెంచ్‌లో కూడా ఆయన ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్‌ఓపీ స్కీమ్‌ను ఆమోదించారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.

Tags:    

Similar News