Legendary Singer Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) మరణం – సినీ, సంగీత రంగం శోకసంద్రం

సినీ, సంగీత రంగం శోకసంద్రం

Update: 2026-04-13 05:07 GMT

Legendary Singer Asha Bhosle: భారతీయ సినిమా సంగీత చరిత్రలో ఒక యుగం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ఆదివారం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆశా భోస్లే అంత్యక్రియలు సోమవారం ముంబయిలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

1933 సెప్టెంబరు 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే, సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ కుమార్తె. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తోపాటు ఉషా, మీనా సోదరీమణులు. సంగీత దర్శకుడు హృదయనాథ్ మంగేష్కర్ సోదరుడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం మోస్తూ, సోదరి లతాతో కలిసి సినిమాల్లో పాడటం మొదలుపెట్టారు.

10వ ఏటనే ‘మాఝా బాల్‌’ అనే మరాఠీ చిత్రంలో ‘చలా చలా నవ్ బాలా’ పాట పాడి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా, 1948లో ‘చునరియా’ సినిమాలోని ‘సావన్ ఆయా’ పాటతో బాలీవుడ్‌లో తన ప్రయాణం ప్రారంభించారు.

7 దశాబ్దాలకు పైగా కొనసాగిన అద్భుత కెరియర్‌లో 20కి పైగా భాషల్లో 12,000కి పైగా పాటలు పాడిన ఆశా భోస్లే, ఎంత క్లిష్టమైన సంగీతాన్నైనా సులభంగా అందించేవారు. ‘చురాలియా’, ‘యే మేరా దిల్ యార్ కా దీవానా’, ‘దమ్ మారో దమ్’ వంటి అజరామర గీతాలు ఆమె స్వరంతో శాశ్వతమయ్యాయి.

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఆశా భోస్లే స్వర సామ్రాజ్యం భారతీయ సంగీత ప్రేమికుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆమె అస్తమయంతో సంగీత లోకం ఒక మహా నక్షత్రాన్ని కోల్పోయింది.

Tags:    

Similar News