Leader of the Opposition in Lok Sabha, Rahul Gandhi: మహాత్మాగాంధీ ఆలోచనలు ద్వేషంతో అంతరించవు: రాహుల్ గాంధీ
ద్వేషంతో అంతరించవు: రాహుల్ గాంధీ
Leader of the Opposition in Lok Sabha, Rahul Gandhi: మహాత్మాగాంధీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప ఆలోచనా ధార, ఒక జీవన విధానమని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సామ్రాజ్య దురహంకారం, ద్వేష భావజాలాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా బాపు ఆలోచనలను తుడిచిపెట్టలేకపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (జనవరి 31, 2026) రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. మహాత్ముడిని అమరత్వం కలిగిన భారతదేశ ఆత్మగా అభివర్ణించారు. స్వాతంత్ర్యంతో పాటు అధికార బలం కంటే సత్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలనే మూల సూత్రాన్ని జాతిపిత దేశానికి అందించారని పేర్కొన్నారు.
తీస్ జనవరి మార్గ్‌లోని గాంధీ స్మృతి వద్ద రాహుల్ గాంధీ పుష్పాంజలి సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మహాత్ముడికి నివాళులు అర్పించారు.
ఇదిలా ఉంటే, మహాత్మాగాంధీ పేరుతో ముడిపడిన ‘ఎంజీనరేగా’ చట్టం ఎక్కువ కాలం కొనసాగడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నచ్చదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎంజీనరేగా చట్ట రద్దును నిరసిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి చేపట్టిన ‘ఎంజీనరేగా బచావో సంగ్రామ్ యాత్ర’లో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గాంధీ స్మృతి వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు నిర్వహించాలనుకున్న ప్రదర్శనను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.