Major Reshuffle in Union Cabinet: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు-చేర్పులపై తీవ్ర ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చివరి క్షణం వరకు గోప్యత పాటించే వ్యూహం ప్రసిద్ధమైనప్పటికీ, వివిధ సంకేతాలు చూస్తే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఎప్పుడైనా పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మంత్రిమండలిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేయడంతో పాటు, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) వంటి పార్టీల నుంచి వచ్చిన చీలిక వర్గాల ఎంపీలు భాజపాకు మద్దతు ప్రకటించడంతో వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భాజపా నూతన సారథి నితిన్ నబీన్ నేతృత్వంలోని జట్టులో కీలక పదవులను కొంతమంది యువ నేతలకు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ పదవుల జాబితా దాదాపు సిద్ధమైంది.

నబీన్ ఇటీవల కొందరు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. కొత్త మంత్రులను చేర్చడం, కొందరి శాఖలను మార్చడం వంటి అంశాలపై స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ సోమవారం వరకు సీషెల్స్ పర్యటనలో ఉన్నారు. జులై 6 నుంచి 11 వరకు విదేశాల్లో ఉంటారు. జపాన్ ప్రధాని సనాయె తకాయిచి జులై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ వెసులుబాటును బట్టి మంత్రిమండలి మార్పులు చేపట్టనున్నారు.

పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకోనున్నారు. శిందే నేతృత్వంలోని శివసేన నుంచి ఒక సీనియర్ నేతకు క్యాబినెట్ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. తృణమూల్, శివసేన (యూబీటీ) చీలిక వర్గాల నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

గవర్నర్లుగా మంత్రులు?

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని గవర్నర్లుగా పంపి, మంత్రిమండలిలో యువ రక్తాన్ని తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నాయి.

ఆప్ నుంచి విడిపోయి భాజపాలో చేరుతున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరికి మంత్రి పదవులు లభించవచ్చు.

కొందరి భవితవ్యం అనిశ్చితం

నెట్ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకనంలో తప్పిదాలు జరగడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం అనిశ్చితంగా మారింది.

రాజ్యసభ సభ్యులుగా నవంబరులో పదవీ కాలం ముగిసే హర్‌దీప్ సింగ్ పురీ, బి.ఎల్. వర్మలకు మరో అవకాశం లభిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. పంకజ్ చౌధరీ, హర్ష్ మల్హోత్రాలకు యూపీ, దిల్లీ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ‘ఒకరికి ఒకే పదవి’ నిబంధన ప్రకారం వీరిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జార్జి కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవీ కాలం ముగిసింది.

యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్‌లకు ప్రాధాన్యం

వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి పలువురికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది.

ఈ మార్పులు ప్రధాని మోదీ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Tags: