Maoists Express Willingness to Surrender Arms: ఆయుధాలు వదులుతామంటున్న మావోయిస్టులు – ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ బహిరంగ లేఖ
ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ బహిరంగ లేఖ
Maoists Express Willingness to Surrender Arms: ఆయుధ సంఘర్షణను తాత్కాలికంగా ముగించి ఆయుధాలు వదిలివేయాలనే నిర్ణయాన్ని మావోయిస్టులు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌లు ఆపివేస్తే, తమ ఆయుధాలను వదులుకునే తేదీని వెంటనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.
లేఖలో, "దేశం, ప్రపంచంలో ఏర్పడుతున్న కొత్త పరిస్థితులను పరిశీలిస్తూ, మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఆయుధాలు త్యజించి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా ఆపేది గురించి తీసుకున్న నిర్ణయాన్ని మేం పూర్తిగా సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులైన సతీశ్ దాదా, చంద్రన్నలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా తుపాకులు వదిలేయాలనే ఆలోచనలో ఉంది. అయితే, మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, ఈ నిర్ణయాన్ని సమష్టిగా చర్చించి చేరుకోవడానికి, మా సహచరులకు సమగ్రంగా సందేశాలు చేరవేయడానికి కొంత సమయం అవసరం" అని పేర్కొన్నారు.
ముఖ్యంగా, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15 వరకు సమయం కల్పిస్తే మాత్రమే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అభ్యర్థించారు. "ఈ సమయాన్ని అడగడానికి మా వెనుక ఇతర ఏ ఉద్దేశాలు లేవు. మా సహచరులతో సమాచారం పంచుకోవడానికి వేగవంతమైన మార్గాలు లేకపోవడమే కారణం. ఈ కాలంలో భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు పూర్తిగా ఆపేయాలి. మేము పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించరు. మా అన్ని కార్యకలాపాలను నిలిపేస్తామని హామీ" అని లేఖలో స్పష్టం చేశారు.
ఈ ప్రకటన మావోయిస్టు ఉద్యమంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా ఆయుధ సంఘర్షణలు తగ్గి, శాంతి చర్చలకు మార్గం సుగమం కావచ్చని ఆశలు వ్యక్తమవుతున్నాయి.