Annamalai: నీట్ రీటెస్ట్‌పై సైనిక స్థాయి భద్రత.. విద్యార్థుల ఒత్తిడి పెరుగుతుందని అన్నామలై

అన్నామలై

Update: 2026-06-16 11:56 GMT

Annamalai: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (NEET Retest)లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్ గుర్తింపు, ముఖ గుర్తింపు, బహుళ దశల తనిఖీలు, సీసీటీవీ నిఘా వంటి చర్యలు తీసుకోనుంది. అయితే ఈ కఠిన ఏర్పాట్లు విద్యార్థులపై ఇప్పటికే ఉన్న పరీక్ష ఒత్తిడిని మరింత పెంచుతాయని బీజేపీ నుంచి ఇటీవల రాజీనామా చేసిన అన్నామలై విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరించింది.

అన్నామలై తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, “వాయుసేన విమానాలు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలు, నాలుగు అంచెల సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు, అనేక దశల తనిఖీలు, ప్రధాని కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షణ.. ఇవన్నీ నీట్ రీటెస్ట్ కోసం చేస్తున్న ఏర్పాట్లు. పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచడం వంటివి విద్యార్థుల ఒత్తిడిని మరింత పెంచుతాయి. ఇది జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను నీరుగారుస్తుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ చర్యలు అసలు సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నామలై వాదనలను బీజేపీ నేత వినోజ్ పి. సెల్వమ్ ఖండించారు. “పెద్దఎత్తున జరిగే పరీక్షల్లో బయోమెట్రిక్, సీసీటీవీ నిఘా, భద్రతా తనిఖీలు సాధారణ ప్రక్రియలే. చైనాలో ప్రతి సంవత్సరం 1.3 కోట్ల మంది విద్యార్థులు ‘గౌకావో’ అనే కఠిన పరీక్ష రాస్తారు. దానిని ఎవరూ సైనికీకరణ అని అనరు. భారత్ అగ్రదేశాలతో పోటీ పడి ముందుకు సాగాలంటే విశ్వసనీయ, నిష్పక్షపాత పోటీ అవసరం. రాజకీయ భయాందోళనలు సృష్టించకుండా విద్యార్థుల్లో వ్యవస్థపై విశ్వాసం కల్పించాలి” అని స్పష్టం చేశారు.

నీట్ రీటెస్ట్ సందర్భంగా టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏర్పాట్లు పరీక్షల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా చేస్తున్నట్లు కేంద్రం వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News