Fadnavis: మిషన్‌ పూర్తి.. ఆపరేషన్‌ విజయవంతమైందన్న ఫడణవీస్‌

ఫడణవీస్‌

Update: 2026-06-22 09:07 GMT

Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శివసేన (యూబీటీ) ఎంపీల చీలిక నేపథ్యంలో ‘ఆపరేషన్ టైగర్‌’ విజయవంతమైందని ప్రకటించారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు” అని ఆయన స్పష్టం చేశారు. ఒక ఆపరేషన్ చేపట్టాక దానిని మధ్యలో విడిచిపెట్టబోమని, ఇప్పటికే దాని విజయాన్ని రుజువు చేసుకున్నామని ఉప ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ శిందే కూడా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

ఆదివారం ఉమ్మడి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఫడణవీస్, త్వరలో బ్రేకింగ్ న్యూస్ వస్తుందని చెప్పారు. ఎంపీలను దూషించి, ఇప్పుడు వారిని వెనక్కి రమ్మనడం ఏ పద్ధతి అని ఉద్ధవ్ ఠాక్రే శిబిరాన్ని ప్రశ్నించారు. శిందే నాయకత్వంలోని శివసేన మాత్రమే బాల్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగిస్తోందని, శివసేన అనేది కేవలం పార్టీ కాదని, సిద్ధాంతాల సంక్రమిత ఆస్తి అని వివరించారు. సిద్ధాంతాలను నమ్ముకున్నవారంతా శిందే నాయకత్వంలోకి వస్తున్నారని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఆత్మ విమర్శ చేసుకోవాలని కూడా సూచించారు.

ఇక ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తన నేతృత్వంలో ఉన్నదే అసలైన శివసేన అని ప్రకటించారు. బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో పోరాడిందేగానీ, దానిని అంతం చేయడానికి ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. శివసేన అధినేత ఎవరు అనేది బయటవారు నిర్ణయించలేరని, పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ)కి చెందిన ఇద్దరు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరుతున్నట్లు ఆదివారం ధ్రువీకరించారు. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.

Tags:    

Similar News