Rahul Gandhi: మన డేటాను విదేశీ శక్తులకు అప్పగిస్తున్న మోదీ ప్రభుత్వం: రాహుల్ ఆరోపణ
అప్పగిస్తున్న మోదీ ప్రభుత్వం: రాహుల్ ఆరోపణ
Rahul Gandhi: భారతీయుల డేటాను సురక్షితంగా భద్రపరచడానికి దేశం కష్టపడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ఒత్తిడికి తలొగ్గి దాన్ని అమెరికా వంటి అగ్రరాజ్యాలకు అప్పగిస్తున్నారని కాంగ్రెస్ నేత, లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కృత్రిమ మేధ (ఏఐ)కు పెట్రోల్‌లాంటి మన డేటాను విదేశీయులకు అమ్మేసేలా మోదీపై ఒత్తిడి తెచ్చారని, ఇది సిగ్గుచేటైన విషయమని ఆయన విమర్శించారు.
‘ఎక్స్’ సామాజిక వేదికపై రాహుల్ తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏఐ వల్ల దేశానికి అవకాశాలతోపాటు ముప్పు కూడా పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. మన ఐటీ, సేవల రంగాలు ఇప్పుడు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నాయని, రాబోయే ప్రభంజనాన్ని ఎదుర్కోకపోతే వేలమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వృత్తినిపుణులు ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు.
తెలివైన మన ప్రజలు సృష్టించిన అపారమైన డేటా మనకు గొప్ప ఆస్తి అని రాహుల్ చెప్పారు. అయితే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి డిజిటల్ వాణిజ్య అడ్డంకులు తొలగించే పేరుతో మోదీ ప్రభుత్వం దాన్ని నిస్సహాయంగా అప్పగిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్, యూట్యూబ్, అమెజాన్, ఆండ్రాయిడ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మన డేటాపై విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం ఉందని, కొత్త ఒప్పందాలతో డేటాను భద్రపరచడం మరింత కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
140 కోట్ల మంది భారతీయుల డేటాను సురక్షితంగా ఉంచడానికి దేశం తంటాలు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చేవని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఏఐ యుగంలో డేటా భద్రతపై ప్రభుత్వం మరింత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.