Narendra Modi: బెంగాల్‌లో మహా జంగిల్‌రాజ్: మాల్దా ఘటనపై మోదీ తీవ్ర విమర్శలు
మాల్దా ఘటనపై మోదీ తీవ్ర విమర్శలు
Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పాలనను ‘మహా జంగిల్‌రాజ్’గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. మాల్దాలో న్యాయాధికారులను ఘెరావ్ చేసిన ఘటనను ఉదహరించి, తృణమూల్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని రక్తసిక్తం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
ఏప్రిల్ 5న కూచ్‌బిహార్‌లోని రాస్ మేళా మైదానంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను తృణమూల్ భయోత్పాతానికి, బీజేపీ భరోసాకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు.
“ఈ క్రూరమైన ప్రభుత్వం బెంగాల్ పవిత్ర నేలపై ప్రతి రోజూ ప్రజాస్వామ్యాన్ని రక్తసిక్తం చేస్తోంది. ఏ రాజ్యాంగ వ్యవస్థనూ లెక్క చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. మాల్దాలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, “రెండు మూడు రోజుల క్రితం న్యాయాధికారులను ఎలా నిర్బంధించిందో దేశం మొత్తం చూసింది. ఇది తృణమూల్ అహంకారానికి మాత్రమే కాదు, మహా జంగిల్‌రాజ్‌కు ఆలవాలమైన తృణమూల్ క్రూర ప్రభుత్వానికి ఉదాహరణ” అని అన్నారు.
తృణమూల్ మెడకు న్యాయపరమైన ఉచ్చు బిగుసుకుంటున్నప్పుడల్లా రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని, సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన దారుణ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాత్మకమని, మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ గూండాల లెక్కలన్నింటినీ సరిచేస్తామని హెచ్చరించారు.
ఈ సభలో ప్రధాని మోదీ తృణమూల్ పాలనలో భయోత్పాతం, అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి సాధించబడతాయని భరోసా ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర బెంగాల్‌లో బీజేపీ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తోంది. కూచ్‌బిహార్ సభ దీనికి భాగంగా భావించవచ్చు. ఈ సభలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.