Union Education Minister Dharmendra Pradhan: నీట్ (యూజీ)-2026 పరీక్షలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుని రీ-పరీక్షను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అర్హులైన ఏ విద్యార్థీ ‘పరీక్ష మాఫియా’ కారణంగా సీటు కోల్పోకుండా చూడాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు.

శుక్రవారం జరిగిన ‘జాగరణ్ భారత్ విద్యా సదస్సు’లో ప్రసంగించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ‘‘ఈ వివాదం వల్ల మేము విమర్శలు, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. దాన్ని అంగీకరిస్తున్నాం. వ్యవస్థను బాగుపరచడం మా బాధ్యత. సమస్యను కళ్లు మూసుకొని విస్మరించడం మా పని కాదు’’ అని చెప్పారు.

జూన్ 21న రీ-పరీక్ష

వచ్చే నెల 21న జరగనున్న రీ-నీట్ (యూజీ) పరీక్షలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ వివాదం కారణంగా మానసిక క్షోభకు గురైన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, వ్యవస్థను పూర్తిగా సరిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు.

ఫీజు రీఫండ్

రద్దైన నీట్ పరీక్ష ఫీజును తిరిగి పొందాలనుకునే అభ్యర్థులు ఈ నెల 27 వరకు ప్రత్యేక పోర్టల్ ద్వారా బ్యాంకు వివరాలు సమర్పించాలని అధికారులు తెలిపారు.

నీట్ కేసులో మరో అరెస్టు

ఈ కేసులో మరో లెక్చరర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. పుణెకు చెందిన ఫిజిక్స్ లెక్చరర్ మనీషా సంజయ్ హవల్దార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు అరెస్టు కావడం గమనార్హం.

Tags: