CM Siddaramaiah: కర్ణాటకలో కొత్త కుల గణన సర్వే: సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

Update: 2025-09-12 10:28 GMT

CM Siddaramaiah: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం (సెప్టెంబర్ 12, 2025) కీలక ప్రకటన చేశారు. 2015లో నిర్వహించిన కుల గణన నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని తెలిపిన ఆయన, 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు కొత్త సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే (కుల గణన) నిర్వహిస్తామని ప్రకటించారు. గత సర్వే జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడిచినందున, మారిన జనాభా లెక్కలను తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయని, ఈ అసమానతలను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సిద్ధరామయ్య అన్నారు. ఈ సర్వే సమర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు అవసరమైన డేటాను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అందరూ సమానమని, సామాజిక న్యాయం సాధించాలని చెబుతుందని, ఈ లక్ష్యంతోనే ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సర్వే సమాజంలోని అసమానతలను తొలగించి, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులను సృష్టించే దిశగా కీలకమైన అడుగు అని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సర్వేలో పాల్గొని, అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వేకు ముందుగా ఆశా కార్యకర్తలు దరఖాస్తు ఫారమ్‌ను అందజేయడానికి ఇంటింటికీ వస్తారని తెలిపారు.

కొత్త కుల గణన సర్వే వివరాలు:

కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఈ సర్వేను నిర్వహించనుంది. రాష్ట్రంలోని సుమారు 7 కోట్ల జనాభా, 2 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించేందుకు ఈ సర్వే జరుగుతుంది. మధుసూదన్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. సర్వే తుది నివేదికను 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ప్రత్యేక గృహ గుర్తింపు స్టిక్కర్ అందజేయబడుతుంది.

కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా స్థితిగతులను తెలుసుకోవడానికి సుమారు 60 ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. ఈ సర్వే కోసం 1.85 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విధుల్లో నియమిస్తారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు రూ. 20,000 వరకు గౌరవ వేతనం చెల్లిస్తారు. దసరా సెలవుల సమయంలో ఈ సర్వే నిర్వహించనున్నారు.

ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ నంబర్లతో జియో-ట్యాగ్ చేయడంతో పాటు రేషన్ కార్డులు, ఆధార్ వివరాలను మొబైల్ నంబర్లతో అనుసంధానిస్తారు. కుల వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని వారు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చు. ఈ సర్వే కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ (8050770004) అందుబాటులో ఉంటుంది. ఈ సర్వే ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 420 కోట్లు కేటాయించింది.

Tags:    

Similar News