వాట్సప్‌ ప్రైవసీ పాలసీ విషయంలో దాని మాతృ సంస్థ మెటా (Meta)పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశ గోప్యతతో ఆడుకోలేమని, ఒక్క డేటా అంశాన్ని కూడా పంచుకోనివ్వమని స్పష్టం చేసింది. దేశ చట్టాలను గౌరవించకపోతే భారత్‌ను వీడి వెళ్లిపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ గట్టిగా హెచ్చరించారు.

 Supreme Court Issues Strong Warning to Meta:2021లో వాట్సప్‌ తీసుకొచ్చిన కొత్త గోప్యతా విధానంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. వినియోగదారుల డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం మెటాతో పంచుకోవడం దోపిడీకి సమానమని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన CJI, మెటా విధానాలు తమకు కూడా అర్థం కాకుండా ఉంటాయని, అలాంటి సంక్లిష్ట పాలసీలను దేశంలోని లక్షలాది పేదలు, చదువు రాని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.

ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపగా, దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయని CJI ఉదాహరణగా చెప్పారు. ఇది వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తుందని స్పష్టం చేశారు.

ఏమిటీ 2021 ప్రైవసీ పాలసీ?

2021 జనవరిలో వాట్సప్‌ కొత్త గోప్యతా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వినియోగదారులు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో చేసే సంభాషణల సమాచారాన్ని ఫేస్‌బుక్ (మెటా)తో పంచుకోవచ్చు. ఈ విధానానికి అంగీకరించని ఖాతాలను రద్దు చేస్తామని మొదట హెచ్చరించింది. అయితే, ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్ట నిబంధనలకు ఇది విరుద్ధమని తేల్చింది.

ఈ నేపథ్యంలో తాజా విచారణలో సుప్రీం కోర్టు మెటాకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. భారతదేశ చట్టాలు, ప్రజల హక్కులను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది.