Nirmala Sitharaman Clarifies: రైతు రుణాల పూర్తి మాఫీకి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ

Update: 2026-03-24 10:42 GMT

Nirmala Sitharaman Clarifies: రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సోమవారం ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

అన్నదాతల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని నిర్మలా సీతారామన్ వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తూ, వడ్డీ రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేవారికి సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISSS) కింద అదనపు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు.

అంతేకాకుండా, రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు ఆమె ప్రకటించారు. వ్యవసాయం సహా ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తూ, పంటల బీమా కవరేజీని కూడా అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News