Pak Gangster Conspiracy: భారత్‌లో నెట్‌వర్క్‌ విస్తరించాలని పాక్‌ గ్యాంగ్‌స్టర్‌ కుట్ర

పాక్‌ గ్యాంగ్‌స్టర్‌ కుట్ర

Update: 2026-05-11 13:18 GMT

Pak Gangster Conspiracy: భారత్‌లో తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2024లో పంజాబ్‌ యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసులో ఐఎస్‌ఐతో సంబంధాలున్న పాక్ గ్యాంగ్‌స్టర్ పేరు వెలుగులోకి రావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.

పాక్ గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ భారత్‌లోని అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కూడా అతని పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ భారత్‌లోని వివిధ లక్ష్యాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

గత కొన్ని నెలలుగా షహజాద్ సోషల్ మీడియా ద్వారా మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాడని నిఘా ఏజెన్సీలు వెల్లడించాయి. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా అతనితో సంప్రదింపులు జరిపిన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన 9 మంది యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, హరియాణాలోని సైనిక స్థావరాలపై కాల్పులు జరపాలని షహజాద్ వీరికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

తన ముఠా ప్రపంచవ్యాప్తంగా 16-17 దేశాల్లో విస్తరించి ఉందని, దాదాపు 300 మంది యువకులు తనతో కలిసి పనిచేస్తున్నారని షహజాద్ ఒక వీడియోలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కూడా అతనికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీవ్రంగా పరిశీలిస్తోంది. షహజాద్ భట్టీని పట్టుకోవడానికి గాలింపు చేపట్టింది.

Tags:    

Similar News