Senior Congress Leader Mani Shankar Aiyar: కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) మళ్లీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయ్యర్ పార్టీలో లేరని రమేశ్ చెన్నితాల వ్యాఖ్యానించగా, అయ్యర్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు.

సోమవారం మాట్లాడిన అయ్యర్, కేరళలో కాంగ్రెస్ గెలవదని, ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వస్తుందని మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘నేను పార్టీ సభ్యుడినని రాహుల్ గాంధీ మరిచిపోయారు. నేను గాంధీవాదిని, నెహ్రూవాదిని, రాజీవ్‌వాదిని. రాహుల్‌వాదిని మాత్రం కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వ్యక్తిగతంగా యూడీఎఫ్ గెలవాలని కోరుకుంటున్నానని, కానీ గాంధేయవాదిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉందని అయ్యర్ తెలిపారు. ‘‘పినరయి విజయన్ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. కాంగ్రెస్‌కు ఎవరు ఓటు వేస్తారు? ఆ పార్టీ నాయకత్వంలో సఖ్యత లేదు. పవన్ ఖేడా లాంటి వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉండటమే పార్టీ దుస్థితికి నిదర్శనం. జైరాం రమేశ్ ఏం చెబితే అదే చేస్తారు’’ అని ఆయన విమర్శించారు.

అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై కూడా అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘థరూర్‌కు సిద్ధాంతాలు లేవు. భాజపా ప్రభుత్వంలో జైశంకర్ స్థానంలో విదేశాంగ వ్యవహారాల మంత్రి అవ్వాలని అనుకున్నారు’’ అని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలతో కేరళలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మధ్య రాజకీయ ఉద్విగ్నత మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags: