PM Modi: ప్రధాని మోదీ: జీఎస్టీ మార్పులతో ప్రజలపై భారం తగ్గనుంది

ప్రజలపై భారం తగ్గనుంది

Update: 2025-09-13 08:20 GMT

 PM Modi: 2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటును సాధించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దృష్టిని ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించారని మోదీ విమర్శించారు. "2014కు ముందు టూత్‌పేస్ట్, సబ్బు, నూనె వంటి రోజువారీ నిత్యావసర వస్తువులపై 27 శాతం పన్ను విధించేవారు. ఇప్పుడు వీటిపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వసూలవుతోంది. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నుల వల్ల సామాన్య కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ ఖరీదైనదిగా మారింది" అని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వం జీఎస్టీ సవరణల ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన ఔషధాల ధరలను తగ్గించినట్లు మోదీ వెల్లడించారు. కార్లు, బైక్‌ల తయారీ సంస్థలు ఇప్పటికే ధరలను తగ్గించాయని, సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరలు కూడా తగ్గనున్నాయని తెలిపారు. హోటళ్లపై జీఎస్టీని 5 శాతం తగ్గించడం వల్ల పర్యాటకులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా దేశంలోని అనేక కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించామని వ్యాఖ్యానించారు. తయారీ రంగంలో వృద్ధి దేశ జాతీయ భద్రతకు కీలకమని, ప్రజల సాధికారత ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి ఎలా బుద్ధి చెప్పిందో ప్రపంచం చూసిందని మోదీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో స్వదేశీ ఆయుధాలు కీలక పాత్ర పోషించాయని, సాయుధ దళాల తెగువకు దేశం గర్విస్తోందని చెప్పారు. మణిపుర్‌లో జాతుల మధ్య హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత, ప్రధాని మోదీ తొలిసారి ఈ రోజు ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ముందుగా మిజోరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అనంతరం చురాచంద్‌పుర్‌కు చేరుకుని, మధ్యాహ్నం 12:30 గంటలకు ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుస్తారు. ఆ తర్వాత చురాచంద్‌పుర్‌లో రూ.7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Tags:    

Similar News