Farooq Abdullah: ఫరూక్‌ అబ్దుల్లాపై పాయింట్‌ బ్లాంక్‌ హత్యాయత్నం.. ‘భగవంతుడే నన్ను కాపాడాడు’ : ఫరూక్‌

‘భగవంతుడే నన్ను కాపాడాడు’ : ఫరూక్‌

Update: 2026-03-12 11:57 GMT

Farooq Abdullah: జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై బుధవారం హత్యాయత్నం జరిగింది. జమ్మూ శివార్లలోని ఓ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో ఆయనపై ఓ వ్యక్తి పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఫరూక్‌ సురక్షితంగా ఉన్నారు.

నిందితుడు జమ్మూలో దుకాణాలు నడుపుతున్న 63 ఏళ్ల కమల్‌ సింగ్‌ జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించాడు. గత 20 ఏళ్లుగా ఫరూక్‌ అబ్దుల్లాను చంపాలని ప్లాన్‌ చేస్తున్నానని, ఇది తన వ్యక్తిగత అజెండా అని పేర్కొన్నాడు. లైసెన్స్‌ ఉన్న తుపాకీని ఉపయోగించాడు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ వేడుకకు ఫరూక్‌తో పాటు జమ్మూ-కశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్‌ ఛౌదరీ కూడా హాజరయ్యారు. ఘటనపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. తండ్రిపై లోడ్‌ చేసిన తుపాకీతో దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందని, భద్రతా సిబ్బంది అప్రమత్తత వల్లే అది విఫలమైందని చెప్పారు. ఫరూక్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నా నిందితుడు ఎలా దగ్గరకు వచ్చాడని ప్రశ్నించారు. భద్రతా లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని డిప్యూటీ సీఎం ఛౌదరీ కూడా అన్నారు.

ఫరూక్‌ అబ్దుల్లా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తొలిసారి స్పందించారు. ‘‘వివాహ వేదిక నుంచి వస్తుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే నన్ను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. వారి అప్రమత్తత వల్లే నేను బయటపడ్డాను. దాడి వెనక ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. ఘటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నుంచి ఫోన్‌ వచ్చింది. నా క్షేమం అడిగి, దర్యాప్తు చేస్తామన్నారు. భగవంతుడే నన్ను కాపాడాడు’’ అని ఫరూక్‌ వివరించారు.

ఈ హత్యాయత్నాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కశ్మీర్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తారిక్‌ హమీద్‌ శాంతి-భద్రతల విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News