Lawrence Bishnoi Gang’s ‘Lady Don’: అందమైన ముసుగులో దాగిన విషం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 'లేడీ డాన్' అరెస్ట్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 'లేడీ డాన్' అరెస్ట్

Update: 2026-02-20 08:43 GMT

Lawrence Bishnoi Gang’s ‘Lady Don’: దేశ రాజధాని ఢిల్లీలో మరో 'లేడీ డాన్' వ్యవహారం బయటపడింది. పగటిపూట బ్యూటీ పార్లర్ నడిపి సాధారణ మహిళలా కనిపించే ఆమె.. రాత్రిళ్లు భారీ డ్రగ్ సిండికేట్‌ను నడిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు సంబంధించిన ఈ మహిళను దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా అనే ఈ మహిళను 'మేడమ్ జహర్' అని డ్రగ్ డీలర్లు పిలుస్తున్నారు. ('జహర్' అంటే విషం). ఈశాన్య ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నడుపుతూ, ఆ ముసుగులో డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇటీవల మహిపాల్‌పుర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో భారీ మోతాదులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ కేసు దర్యాప్తులో 'మేడమ్ జహర్' అనే పేరు వినిపించడంతో ఆమె వైపు దృష్టి సారించారు. నిఘా పెట్టి, పక్కా సమాచారంతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె దీర్ఘకాల స్నేహితుడు బాబీ కబూతర్ (అసలు పేరు మహ్‌ఫూజ్) మరియు మరో ఇద్దరిని కూడా స్పెషల్ సెల్ విభాగం అదుపులోకి తీసుకుంది.

ఖుస్నుమా గత కొన్నేళ్లుగా ఢిల్లీలో డ్రగ్ సిండికేట్‌ను నడుపుతోంది. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్‌కు ఆమె సన్నిహిత స్నేహితురాలు. బాబీ కబూతర్ పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న సలీమ్ పిస్టోల్ అనే అక్రమ ఆయుధాల డీలర్ నుంచి ఆయుధాలు సేకరిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసేవాలా హత్య, నటి దిశా పటానీ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనల్లో బాబీ సరఫరా చేసిన ఆయుధాలే వాడబడ్డాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పోలీసులు ఈ ముఠా ఆర్థిక కార్యకలాపాలు, స్లీపర్ సెల్స్, ఇతర సభ్యుల గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న దీపా, జోయా ఖాన్‌లను కూడా దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు గ్యాంగ్‌లలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News