Rahul Gandhi Criticizes Narendra Modi: విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత ఆధిపత్యంలోకి మారింది: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ
రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ
Rahul Gandhi Criticizes Narendra Modi: మన దేశ విదేశాంగ విధానం ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయంగా జోక్‌గా మిగిలిపోయిందని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఎద్దేవా చేశారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మోదీ ఏం చేయగలరో, ఏం చేయలేరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కచ్చితంగా తెలుసు. ప్రధాని రాజీపడితే, దేశ విదేశాంగ విధానం కూడా రాజీపడినట్లే అవుతుంది” అని రాహుల్ ఆరోపించారు.
మోదీ నిన్న పార్లమెంటులో ఏమాత్రం సంబంధం లేని ప్రసంగం చేశారని, పరిస్థితి కొవిడ్ లాగా ఉంటుందని చెప్పడం సరికాదని విమర్శించారు. కరోనా సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎన్ని విషాదాలు జరిగాయో మోదీ మరచిపోయారని ఆయన అన్నారు.
“మోదీ ప్రధాని. ఆయన ఆ పదవికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. కానీ అలా లేదు. ఇది దేశానికి హాని చేస్తుంది” అని రాహుల్ హెచ్చరించారు. ఎల్‌పీజీ, పెట్రోలు, ఎరువులు వంటి అంశాలు త్వరలో సమస్యలుగా మారనున్నాయని, ప్రభుత్వం వీటిని అర్థం చేసుకోలేకపోతోందని ఆరోపించారు.
అమెరికా, ఇజ్రాయెల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని, దేశ ప్రయోజనాల కోసం కృషి చేయరని రాతపూర్వకంగా చెప్పగలనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల రాజ్యాంగ హక్కులపై, వారి అస్తిత్వంపై ప్రభుత్వం సంకుచిత బుద్ధితో దాడి చేస్తోందని కూడా రాహుల్ ఆరోపించారు.
ఇతర వార్తలు:
అస్సాం కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బార్డోలోయీ రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. ఆయన శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేయనున్నారు.
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందని వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు.
దేశంలో ఎక్కడా యాంటీ-ర్యాబిస్ వ్యాక్సిన్‌కు కొరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా రాజ్యసభలో స్పష్టం చేశారు. ఎగుమతిని ఆపాల్సిన అవసరం లేదన్నారు. ఏటా 58 లక్షల జంతువుల కాట్ల కేసుల్లో 47 లక్షలు కుక్క కాట్లేనని వెల్లడించారు.