Rahul Gandhi Urges: దేశ విద్యా వ్యవస్థలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వం వరకు చేర్చే లక్ష్యంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్‌’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

ప్రశ్నపత్రాల లీకేజీలు, అధిక ఫీజులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, అధిక ఆర్థిక భారం, తీవ్ర ఒత్తిడి వంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి చేరవేయడం ఈ ఉద్యమం లక్ష్యం. ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా ప్రచార లింక్‌ను పోస్ట్‌ చేసిన రాహుల్‌ గాంధీ, విద్యా వ్యవస్థ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అన్ని విద్యార్థులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇది సాధారణ సంతకాల సేకరణ కార్యక్రమం కాదని, విద్య, న్యాయమైన పరీక్షలు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ఒక వేదికగా ఉంటుందని రాహుల్‌ తెలిపారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులపై భారీ ఆర్థిక ఒత్తిడి మోపుతూ, వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని ఆయన విమర్శించారు.

ఈ ఉద్యమం ద్వారా విద్యార్థుల గొంతుకను బలోపేతం చేసి, విద్యా రంగంలో సానుకూల మార్పులను తీసుకురావాలని రాహుల్‌ గాంధీ ఆకాంక్షించారు. విద్యార్థులు తమ సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేయాలని ప్రత్యేక పిలుపు ఇచ్చారు.

Tags: