Red Fort Blast Case: ఎర్రకోట పేలుడు కేసు: పార్కింగ్ ఏరియాలోనే బాంబు అసెంబుల్ చేసిన ఉమర్.. దర్యాప్తులో కీలక విషయాలు
దర్యాప్తులో కీలక విషయాలు
Red Fort Blast Case: ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజా దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన ముఖ్య నిందితుడు ఉమర్ మహమ్మద్ (అలియాస్ ఉమర్-ఉన్-నబి ఖాన్) ఎర్రకోట పార్కింగ్ లాట్‌లో నిలిపిన కారు లోపలే బాంబును తయారు చేసి, అసెంబుల్ చేశాడని తేలింది.
దర్యాప్తు అధికారులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, పేలుడుకు ముందు ఉమర్ దాదాపు మూడు గంటల పాటు కారులోనే కూర్చొని ఉండి, బాంబు ప్లాన్‌ను రెడీ చేశాడు. ఈ మూడు గంటల్లో ఒక్కసారి కూడా కారు నుంచి బయటకు రాలేదు. పేలుడు స్థలంలో ముందుగా రెక్కీ నిర్వహించినట్టు కూడా సీసీటీవీ ఆధారాలు లభించాయి.
అంతకుముందు ఢిల్లీలో ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేయాలనే విషయంపై ఉమర్ తన సహచరులతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్‌ను లక్ష్యంగా ఎంచుకోవాలని వారు నిర్ణయించారు. ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉందనే భయంతో ఉమర్ దాడిని త్వరగా నిర్వహించాలని ఆతురత పడ్డాడని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై ఎన్‌ఐఏ ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఉమర్‌తో పాటు సంబంధాలు ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.